సెప్టెంబర్ 16న నిమజ్జనానికి రెడీ

 సెప్టెంబర్  16న నిమజ్జనానికి రెడీ
  • గ్రేటర్​వరంగల్​లో 24 ప్రాంతాల్లో ఏర్పాట్లు
  • పోలీస్​బాస్, గ్రేటర్​మేయర్, కమిషనర్​పరిశీలన
  • రెండు జిల్లాల పరిధి ఆఫీసర్లతో కలెక్టర్ల సమీక్షలు
  • చెరువుల వద్ద క్రేన్​లు ఏర్పాటు
  • పోలీస్​ పోర్టర్​లో 4,500 విగ్రహాలు నమోదు
  • అపార్టుమెంట్, ఆలయాల్లో మరో 900 విగ్రహాలు

వరంగల్, వెలుగు: గ్రేటర్​వరంగల్​లో గణేశ్ నిమజ్జనాల ఏర్పాట్లపై అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు.15 నాటికి నవరాత్రులు ముగుస్తున్నందున ఈ నెల 16న గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్​సిటీ జంట జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో రెండు మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని గ్రేటర్​మేయర్​గుండు సుధారాణి, కమిషనర్​అశ్విని తానాజీ వాఖడే నిమజ్జనం ప్రాంతాలను ఫైనల్​ చేశారు. కమిషనరేట్​పోలీస్​బాస్​అన్ని చెరువులను పరిశీలించారు.

5,400 విగ్రహాలు.. 24 నిమజ్జన పాయింట్లు 

ట్రై సిటీలోని 66 మున్సిపల్​డివిజన్ల పరిధిలో ఈ ఏడాది దాదాపు 5,400 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు గ్రేటర్​వరంగల్​గణేశ్​ ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీస్​ అధికారులు తెలిపారు. ఇందులో 4,500 ప్రతిమలు పోలీస్​ పోర్టల్​లో నమోదు చేయగా అపార్టుమెంట్లు, ఆలయాలు, సొంత స్థలాల్లో మరో 900 విగ్రహా మండపాలు ఉన్నాయన్నారు. వీటి నిమజ్జనం కోసం ప్రధాన చెరువులు, సిటీ అవతల ఉండే చిన్న చెరువులతో కలిపి మొత్తంగా 24 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 24 క్రేన్లతో పాటు పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే వరంగల్, కాజీపేట​ ప్రాంతాల్లో మరో 2 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు.

హనుమకొండ పద్మాక్షి టెంపుల్​ సిద్దేశ్వర గుండం, వరంగల్​ చిన్న వడ్డెపల్లి చెరువు, వరంగల్​ కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్​ ఉర్సు గుట్ట రంగం చెరువు, మామూనూర్​బెస్తం చెరువు, ఖిలా వరంగల్​అగర్తల చెరువు, మామూనూర్​పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్​పూర్​ చెరువు, బీమారం చెరువు, హసన్​పర్తి  చెరువులను ప్రధాన పాయింట్లుగా ఉన్నాయి. 

చిన్నవి.. మీడియం.. పెద్దవి

చెరువు లోతు, వెడల్పు, క్రేన్​ ఏర్పాట్ల ఆధారంగా ప్రతిమలను చిన్నవి, మీడియం, పెద్దవిగా విభజించారు. 5 నుంచి 8 అడుగుల మధ్య ఉన్న విగ్రహాలను హనుమకొండ సిద్ధేశ్వర గుండం, మీడియం సైజ్​వి​కాజీపేట దర్గా రోడ్డులోని బంధం చెరువు, పెద్దవాటిని పెదమ్మగడ్డ​దాటాక హనుమాన్ జంక్షన్​లోని కోట చెరువులో వేసేలా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకంటే పెద్దవిగా ఉండేవాటిని కొందరు కాళేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు వెళ్తున్నారు.

మట్టి వినాయకులు, ఆదర్శ పూజలకే..బహమతులు

ఏటా ట్రైసిటీ గణేశ్​ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. మట్టి వినాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆ తర్వాత ఆదర్శ పూజలు, సేవా కార్యక్రమాలు, నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకలతో పాటు మండపాల వద్ద ఎక్కువ మంది కాలనీవాసుల ప్రమేయం ఉన్నవారికే బహుమతుల కేటాయింపులో ప్రయారిటీ ఇస్తున్నారు. ఉత్సవ సమితి బాధ్యులు గ్రేటర్​ వరంగల్​ పరిధిని 7 జోన్లుగా విభజించారు.

దాదాపు 200 మంది ప్రతినిధులు సర్వేల్లో పాల్గొన్నారు.7 జోన్ల పరిధిలో మొదటి, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్​ బహుమతులు ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఇందులో నుంచి  గ్రేటర్​పరిధి మొత్తానికి కలిపి ఈ నెల 15న బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.