- ఈనెల 20న నిర్వహణకు అధికారుల సన్నాహం
- ఎన్నికల కోడ్‍తో ఆగిన వరంగల్ సిటీ 2024_25 బడ్జెట్
- గతంలో ఫడ్స్లేకున్నా ఆకాశానికి నిచ్చనేసేలా బడ్జెట్పెట్టిన బీఆర్ఎస్
- నయా సర్కార్ జీడబ్ల్యూఎంసీ బడ్జెట్‍పై జనాల్లో ఆసక్తి
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2024_25 బడ్జెట్ పెట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఏటా ఫిబ్రవరి చివరి వారంలో జీడబ్ల్యూఎంసీ వార్షిక బడ్జెట్ పెట్టే ఆనవాయితీ ఉండగా, ఎన్నికల కోడ్ఉండడంతో పట్టించుకోలేదు. ప్రస్తుతం కోడ్ ముగియడంతో ఆఫీసర్లు బడ్జెట్ మీటింగ్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. అయితే, రాష్ట్రం వచ్చాక దాదాపు పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ గ్రేటర్ వరంగల్ అభివృద్ధి, బడ్జెట్ విషయంలో సపరేట్ ఫడ్స్ ఇస్తామని మాయమాటలు చెప్పారే తప్ప, నిధులు ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు, సిబ్బంది జీతాలకు కూడా బల్దియా ఖాతాలో డబ్బులులేని దుస్థితి వచ్చింది. ఇప్పడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, తొలిసారి ప్రవేశపెట్టబోయే గ్రేటర్ వరంగల్ బడ్జెట్‍పై జనాలు ఆసక్తి, ఆశతో ఉన్నారు.
రాష్ట్రానికి రెండో రాజధాని..
రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని ఉండగా, ఓరుగల్లును రెండో రాజధానిగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే సిటీలోని జీహెచ్‍ఎంసీ తర్వాత అంతేస్థాయి కలిగిన గ్రేటర్ వరంగల్ జీడబ్ల్యూఎంసీపై అందరిచూపు ఉంటోంది. గ్రేటర్ వరంగల్ పరిధి 407.71 స్వ్కేర్ కిలోమీటర్లుండగా, అధికారుల లెక్కల ప్రకారం 10,48,989 మంది జనాభా ఉంది. కార్పొరేషన్‍లోని 66 డివిజన్లలో 2,54,354 ఇండ్లు ఉన్నాయి. స్లమ్ ఏరియాలు 183 (నోటిఫైడ్ 92, నాన్ నోటిఫైడ్ 91) ఉన్నాయి. రోడ్ల విస్తీర్ణం 1,646 కిలోమీటర్లు ఉండగా, డ్రైనేజీలు మొత్తం 1433 కిలోమీటర్ల పరిధిలో ఉంది. మొత్తంగా హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా గ్రేటర్ వరంగల్ ఉంది.
కేసీఆర్ హామీలు ఉత్తదే..
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ 2016లో వరంగల్ సిటీలో పర్యటించారు. ప్రస్తుత శ్రీదేవి ఏషియన్ మాల్ పక్కనే పేదలు గుడిసెల్లో ఉండే జితేందర్‍సింగ్ కాలనీ, ఎస్‍ఆర్ నగర్ తదితర కాలనీల్లో పర్యటించి, రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించారు. అనంతరం నక్కలగుట్ట నందన గార్డెన్‍లో గ్రేటర్ అధికారులతో రివ్యూ, ప్రెస్‍మీట్ నిర్వహించారు. వరంగల్ నగరాభివృద్ధికి రెగ్యూలర్ బడ్జెట్, ఫండ్స్‌తో సంబంధం లేకుండా ఏటా రూ.300 కోట్ల సపరేట్ నిధులు ఇస్తానని మాటిచ్చారు. దానిని నమ్మిన గ్రేటర్ అధికారులు ఏటా జీడబ్ల్యూఎంసీ అంచనా బడ్జెట్‍ను ఆకాశానికి ఎత్తేశారు.
అప్పటి వరకు రూ.300 కోట్ల వరకు ఉండేదానిని ఏకంగా వెయ్యి, రూ.1,100 కోట్లుదాటి రూ.1,431 కోట్లకు తీసుకువెళ్లారు. కేసీఆర్ ఇస్తానన్న నిధులు నీటిమూటలేనని అర్ధం చేసుకున్న అధికారులు, 2020_21లో రూ.305 కోట్ల వాస్తవిక బడ్జెట్‍కు దిగొచ్చారు. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ లేదంటే మున్సిపల్ మినిష్టర్‍గా కేటీఆర్ గ్రేటర్ వరంగల్ డెవలప్‍మెంట్ నిధులు తమదేనని వేలాది కోట్ల పనులకు శిలాఫలకాలు వేసి జనాలకు ఆశ పెట్టారు. దాంతో బడ్జెట్ మళ్లీ రూ.612 వరకు పెరిగింది తప్పితే కేసీఆర్ ప్రభుత్వం ఫండ్స్ఇవ్వలేదు.
అంచనాలు తప్పినై.. పనులు ఆగినై..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారుల బడ్జెట్ అంచనాలు ఏటా తప్పుతున్నాయి. లోకల్‍గా జనాల నుంచి వచ్చే పన్నుల ద్వారానే బల్దియా సొంత ఆదాయం రూ.200 నుంచి రూ.213 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. తీరాచూస్తే ఏటా అది రూ.65 కోట్ల నుంచి రూ.85 కోట్లలోపే ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లను రూ.400 నుంచి రూ.800 కోట్లకు చూపారు. అవి కూడా రూ.100 నుంచి రూ.200 కోట్లలోపే ఉంటున్నాయి. దీంతో సీఎం అష్యూరెన్స్, జనరల్ ఫండ్స్, స్మార్ట్‌సిటీ స్కీంలో చేపట్టిన ఎన్నో పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆపారు. కొత్త పనులకు శిలాఫలకాలు వేయడంమే కానీ పనులు మొదలుపెట్టలేదు.
అడుగడుగునా కేర్‍లెస్..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో అధికారులు ఏండ్ల తరబడి పాతుకుపోవడంతో ప్రతి పనిలో కేర్‍లెస్ కనిపిస్తోంది. బడ్జెట్ అంచనాలు మొదలు పన్నుల వసూళ్ల వరకు, అభివృద్ధిపై రెగ్యూలర్ సర్వసభ్య సమావేశాల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు నిర్లక్ష్యమే చూపారు. ఇక్కడకు వచ్చే కమిషనర్లు మూడేండ్లు కూడా ఉండట్లేదు. దీంతో జీడబ్ల్యూఎంసీ గాడిలో పడట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏటా ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా, మార్చి 14 తర్వాత ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని తెలిసినా అధికారులు 2024_25 ఏడాదికి బడ్జెట్ పెట్టలేదు. దీనికితోడు మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్లు రాజకీయ వాతావరణం ఉండటంతో గ్రేటర్ పాలకవర్గం తీరుపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కోడ్ముగియడంతో కాంగ్రెస్సర్కారు హయాంలో తొలిసారి గ్రేట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుండడంతో స్థానికంగా ఆసక్తి నెలకొన్నది.