2 వేల మంది జీహెచ్​ఎంసీ కార్మికుల గోస

2 వేల మంది జీహెచ్​ఎంసీ కార్మికుల గోస
  • 2 వేల మంది జీహెచ్​ఎంసీ కార్మికుల గోస ఆఫీసర్ల ఇండ్లల్ల చాకిరి
  •     జనం కోసం పనిచేయాల్సిన వాళ్లను సొంత పనులకు వాడుకుంటున్నరు
  •     మాట వినకపోతే వేధింపులు.. ఉద్యోగం ఊడగొడ్తామంటూ బెదిరింపులు
  •     ఫిర్యాదులు చేసినా పట్టించుకోని  పెద్దాఫీసర్లు
  •     జాతీయ సఫాయి కర్మచారి కమిషన్​కు కార్మిక సంఘాల లేఖ


హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ పరిధిలో పని చేయాల్సిన కార్మికులను అధికారులు తమ ఇండ్లలో, ఫామ్​హౌస్​లలో పని చేయించుకుంటున్నారు. టాయిలెట్లు సాఫ్​ చేయడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇట్లా దాదాపు 2వేల మంది జీహెచ్​ఎంసీ  ఔట్​ సోర్సింగ్ కార్మికులను అధికారులు తమ సొంత పనుల కోసమే వాడుకుంటున్నారు.  

మరికొందరినైతే ఇటు జీహెచ్​ఎంసీ పనులతో పాటు అటు అధికారుల ఇంటి పనులకు ఉపయోగించుకుంటున్నారు.  ఎన్నో ఏండ్ల నుంచి ఈ తతంగం నడుస్తున్నా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా.. పట్టించుకునే దిక్కు లేదు. దీంతో కార్మిక సంఘాలు ఇటీవల జాతీయ సఫాయి కర్మచారి కమిషన్​కు ఫిర్యాదు చేశాయి. ఆధారాలతో లేఖ రాశాయి. జీతం జీహెచ్​ఎంసీ నుంచి ఇస్తూ సొంత పనులకు ఉపయోగించుకోవడం ఏమిటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన వారిని అధికారుల ఇంటి పనులకు పరిమితం చేయడం ఏమిటని 
నిలదీస్తున్నాయి. 

2 వేల మంది ఇదే పనికి

ఏఎంహెచ్ వోలు, డిప్యూటీ కమిషనర్ల నుంచి మొదలు పెడితే దాదాపు చాలా మంది అధికారుల ఇండ్లలో బల్దియా కార్మికులే పనిచేస్తున్నారు. ఫంక్షన్లు ఉన్న సమయంలో అయితే డజన్ల కొద్ది కార్మికులను అధికారులు తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో  ఔట్ సోర్సింగ్​ పద్ధతిలో వివిధ విభాగాల్లో 27,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 2 వేల మంది వరకు అధికారుల ఇండ్లలో పని చేసేందుకే పరిమితమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా శానిటేషన్, వెటర్నరీ, అర్బన్ బయోడైవర్సిటీ, హార్టికల్చర్ తదితర విభాగాల్లోని కార్మికులు అధికారుల ఇండ్లలో పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ డ్యూటీ మాదిరిగానే కొందరు అధికారులు ఏకంగా తమ ఇండ్ల వద్ద షిఫ్ట్ ల వారీగా కార్మికులతో  పనిచేయించుకుంటున్నట్లు సమాచారం. కొందరు ఆఫీసర్ల ఇండ్లలో ఇద్దరు, ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. తమ ఇండ్ల వద్ద పనిచేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని కొందరు అధికారులు  బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

పట్టించుకునే దిక్కు లేదు

అధికారులు తమ ఇండ్లలో జీహెచ్​ఎంసీ కార్మికులతో పనులు చేయించుకుంటున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఇదే అంశంపై బల్దియా కమిషనర్​కు ఫిర్యాదులు వెళ్లినా స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కింది స్థాయి సిబ్బందిపై చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే  చర్యలు తీసుకుంటున్న కమిషనర్​.. కార్మికులతో సొంత పనులు చేయించుకుంటున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్  పట్టించుకోకపోవడంతో అధికారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయని అంటున్నారు. జీహెచ్​ఎంసీ నుంచి జీతాలు పొందుతున్న వారిని అధికారులు సొంత పనులకు ఉపయోగించుకోవడం ద్వారా  ప్రజాధనం వృథా అవుతున్నదని చెప్తున్నారు. 

కమిషనర్​ ఎందుకు పట్టించుకోవట్లే..

జీహెచ్​ఎంసీ కార్మికులు ప్రజల కోసం పనిచేసేందుకు ఉన్నరు. అధికారులు ఇండ్లలో చేసేందుకు కాదు. వేల మంది కార్మికులు అధికారుల ఇండ్లలో పనికే పరిమితమైతే నగరం ఎట్లా క్లీన్​గా ఉంటది. ఇండ్లు, ఫామ్​హౌస్​లలో టాయిలెట్లు క్లీన్​ చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నరు. ఇప్పటికే చాలా మందిపై సఫాయి కర్మచారి కమిషన్​కు ఫిర్యాదు చేశాం. అధికారుల వేధింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. కార్మికులు అధికారుల ఇండ్లలో పని చేసేందుకు వెళ్లొద్దు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్​కు ఫిర్యాదు చేసినా ఆయన ఎందుకు పట్టించుకుంటలేరో అర్థమైతలేదు. 
- ఊదరి గోపాల్, బీజేపీ మజ్దూర్ సెల్​ సిటీ ప్రెసిడెంట్​(జీహెచ్ ఎంఈయూ ప్రెసిడెంట్​)