ట్రిపుల్‌‌ఆర్‌‌‌‌ నిర్వాసితులకు పరిహారం ఎంతివ్వాలి! ఆఫీసర్లు మల్లగుల్లాలు

ట్రిపుల్‌‌ఆర్‌‌‌‌ నిర్వాసితులకు పరిహారం ఎంతివ్వాలి! ఆఫీసర్లు మల్లగుల్లాలు
  • నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చేలా చూడాలన్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • పరిహారం పెంచేందుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేసిన ఆఫీసర్లు
  • బహిరంగ మార్కెట్‌‌‌‌ రేటుకు సంబంధించిన ఆధారాలు కావాలన్న ఉన్నతాధికారులు
  • వచ్చే నెలలో ఫైనల్‌‌‌‌ కానున్న పరిహారం

యాదాద్రి, వెలుగు : రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌) నిర్మాణం కోసం యాదాద్రి జిల్లాలో సేకరించే భూములకు ‘అవార్డు’ ప్రకటనపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. భూములను కోల్పోతున్న వారికి తగిన పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించడంతో ఆఫీసర్లు కలెక్టరేట్‌‌‌‌లో ప్రతిరోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ కోసం సేకరించే భూమికి రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువ ఎంత ఉంది ? బహిరంగ మార్కెట్లో ఎంత పలుకుతుంది ? అనే వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రభుత్వ రేటు కంటే బహిరంగ మార్కెట్‌‌‌‌లోనే ఎక్కువ రేటు పలుకుతుండడంతో దానికి సంబంధించిన ఆధారాలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు.

Also Read:-దుబాయ్​లో సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బ్యాంకు ఖాతాలు

కోర్టు స్టేతో ఆగిన భూ సేకరణ

భారత్‌‌‌‌ మాల పరియోజన  ఫేజ్‌‌‌‌ 1లో భాగంగా చేపట్టిన రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు ఉత్తర భాగం యాదాద్రి జిల్లా మీదుగా వెళ్తోంది. మొత్తం 59.33 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉండగా, ఇందుకోసం జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌‌‌‌ మండలాల్లో 1,927 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా 1,481 ఎకరాలకు సంబంధించి గతంలోనే త్రీ ఏ, త్రీ డీ నోటిఫికేషన్లతో పాటు త్రీ జీ గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ను సైతం విడుదల చేశారు.​ 

ఉత్తర, దక్షిణ రింగ్‌‌‌‌ రోడ్డును కలపడానికి చౌటుప్పల్‌‌‌‌లో 258 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇందుకోసం సర్వే చేస్తున్నారు. ఈ భూమికి సంబంధించి త్రీ ఏ నోటిఫికేషన్‌‌‌‌ను జారీ చేశారు. మరో 188 ఎకరాలకు త్రీ జీ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయాల్సి ఉంది. అయితే భూ సేకరణను వ్యతిరేకిస్తూ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు హైకోర్ట్‌‌‌‌ను ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది.

స్టే వెకెట్‌‌‌‌పై 27న విచారణ

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ ఉత్తర భాగం నిర్మాణం కోసం భూ సేకరణను స్పీడప్‌‌‌‌ చేయాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఇటీవల ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో రాయగిరి భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన స్టే వేకెట్‌‌‌‌ కోసం ఆఫీసర్లు పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ ఈ నెల 27న జరగనుంది. అయితే భూములు కోల్పోతున్న రైతులకు మానవతా ధృక్పథంతో ఆలోచించి తగిన పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో ఆఫీసర్లు ప్రతి రోజు యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూలు నిర్వహిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌‌‌‌ వాల్యూ లక్షల్లో... 
బహిరంగ మార్కెట్‌‌‌‌ కోట్లలో..

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం గతంలో రెండుమార్లు భూముల రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువను పెంచింది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌‌‌‌తో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన రేటు తక్కువగానే ఉంది. ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌‌‌‌ మండలాల్లో సేకరించే భూముల రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువను ఆఫీసర్లు ఇప్పటికే సేకరించారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎకరం భూమి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పలుకుతుండగా, భువనగిరి, వలిగొండలో రూ. 7 లక్షల నుంచి రూ. 13.50 లక్షలు, చౌటుప్పల్‌‌‌‌ మండలంలో రూ.12 లక్షల వరకు పలుకుతోంది. 

అయితే బహిరంగ మార్కెట్‌‌‌‌లో మాత్రం ఎకరం భూమి ఏరియాను బట్టి రూ. కోటి నుంచి రూ. ఐదు కోట్ల వరకూ పలుకుతోంది. ఇండ్ల స్థలాలు గజం రూ. 800 నుంచి రూ. 3,100 వరకు ప్రభుత్వ రేటు ఉండగా, బహిరంగ మార్కెట్‌‌‌‌లో రూరల్‌‌‌‌ ఏరియాల్లో గజం రూ. 5 వేలు, అర్బన్‌‌‌‌ ఏరియాల్లో గజం రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది. దీంతో ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌కు భూములు ఇచ్చేందుకు రైతులు విముఖత చూపుతున్నారు.

త్వరలోనే అవార్డు ప్రకటన

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ కోసం సేకరించే భూమి పరిహారానికి సంబంధించి త్వరలో అవార్డు ప్రకటిస్తామని ఆఫీసర్లు తెలిపారు. అవార్డు నిర్ణయించడానికి ముందు మూడేండ్లలో భూముల ధరలు ఏఏ స్థాయిలో పెరిగాయో మార్పులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ఆ తర్వాత అవార్డును ఖరారు చేయనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. అవార్డు ఖరారు వ్యవహారం వచ్చే నెలలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అవార్డును నేషనల్‌‌‌‌ హైవే ఆఫీసర్లు కన్ఫర్మ్‌‌‌‌ చేసిన తర్వాత రైతులు, ఇతరులకు నగదు అందిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పరిహారం పెంపు కోసం ప్రపోజల్స్‌‌‌‌

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ కోసం సేకరించే భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌‌‌‌ వ్యాల్యూకు సంబంధించిన డేటాను ఆఫీసర్లు ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. భూములు కోల్పోతున్న రైతుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలన్న సీఎం సూచన మేరకు ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌‌‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువతో పాటు బహిరంగ మార్కెట్‌‌‌‌లో భూములకు పలుకుతున్న రేటుతో ఆఫీసర్లు రిపోర్ట్‌‌‌‌ రెడీ చేశారు. 

రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువలో 30 నుంచి 40 శాతం పెంచి ఇస్తే ఎకరానికి, గజానికి ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందన్న వివరాలతో నోట్‌‌‌‌ తయారు చేశారు. అయితే బహిరంగ మార్కెట్‌‌‌‌లో ఎక్కువ రేటు పలుకుతున్నందున, దానికి సంబంధించి ఆధారాలు కావాలని ఉన్నతాధికారులు అడగడంతో జిల్లా ఆఫీసర్లకు ఏం చేయాలో తోచడం లేదు. కొనుగోళ్లు బహిరంగ మార్కెట్‌‌‌‌ రేటు ప్రకారం జరిగినా.. రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రభుత్వ రేట్లతోనే జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు బహిరంగ మార్కెట్‌‌‌‌ రేటుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడం ఎలా సాధ్యమని జిల్లా ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు.