రేపు, ఎల్లుండి గ్రూప్2 ఎగ్జామ్స్

రేపు, ఎల్లుండి గ్రూప్2 ఎగ్జామ్స్
  • మంచిర్యాల జిల్లాలో 48 సెంటర్లు, 14,951 మంది అభ్యర్థులు
  • ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ కుమార్ దీపక్ రివ్యూ

మంచిర్యాల, వెలుగు: ఈ నెల15, 16 తేదీల్లో గ్రూప్‌–2 ఎగ్జామ్స్ నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 సెంటర్లను ఏర్పాటు చేయగా, 14,951 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌, 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌3, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-4 పరీక్షలు జరుగుతాయి. 

అభ్యర్థులను ఉదయం 8.30, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు గేట్లు క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ టైం ముగిసేంత వరకు అభ్యర్థులను సెంటర్ నుంచి బయటకు అనుమతించరు.  పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌లను ఇన్విజిలేటర్లకు అందించి క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లవచ్చు.  జిల్లాలో గ్రూప్ 2 ఎగ్జామ్స్‌ ను  పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. 

శుక్రవారం అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, డీసీపీ ఏ. భాస్కర్‌‌తో  కలిసి కలెక్టరేట్‌లో  సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  అభ్యర్థులు ఎగ్జామ్ టైంకు గంటన్నర ముందే రావాలని,  అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం విధించిన గైడ్లైన్స్ పాటిస్తూ టైం ప్రకారం హాజరుకావాలని సూచించారు.