- దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీడర్ ఛానళ్లు
- సకాలంలో నాట్లు పడక ఆందోళనలో రైతులు
వనపర్తి, వెలుగు: గద్వాల, వనపర్తి జిల్లాలకు వరప్రదాయినిగా పిలిచే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (పీజేపీ) కాల్వల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో సాగు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వానలు ఆలస్యంగా కురవడంతో జూరాల కుడి, ఎడమ కాలువల నుంచి సాగునీటి విడుదల ఆలస్యం అయ్యింది. జూరాల ఎడమ కాల్వ కింద వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, వీపనగండ్ల, పాన్ గల్ మండలాలకు సాగు నీరు అందుతోంది. సుమారు 60 కి.మీ. పొడవున్న ప్రధాన కాలువ ద్వారా 87 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఈ కాలువ నుంచి మరో 300 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ, ఫీడర్ ఛానళ్ల కాలువలు ఉన్నాయి.
ఫీడర్ ఛానళ్ల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నీళ్లు వదిలిన సమయంలో ఫీడర్ ఛానళ్ల కాల్వల పూడికలు, గండ్లు పడితే రైతులు తమ సొంత ఖర్చులతో రిపేర్లు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రైతులు ఫీడర్ ఛానళ్ల కాలువలను కబ్జా చేసి తమ భూమల్లో కలుపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తరచూ రైతుల మధ్య గొడవలు జరిగి పంచాయితీలు పోలీస్ స్టేషన్ కు చేరుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామం రామేశ్వరాపూర్ శివారులోని ఓ రైతు ఎన్నో ఏళ్లుగా తన పొలంలో ఉన్న ఫీడర్ ఛానల్ కాల్వను పూడ్చివేసి ఆక్రమించుకోవడంతో బాధిత రైతులు పెబ్బేరు పోలీసులకు, జూరాల ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. కాల్వల నక్షాలు జూరాల అధికారుల దగ్గర ఇప్పటికీ లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూరాల భూములకు రక్షణ కరువు...
జూరాల ప్రాజెక్ట్ కోసం ప్రధాన కాలువలతో పాటు మేజర్, మైనర్ కాల్వలు నిర్మించారు. దీని కోసం భూములను రైతుల నుంచి సేకరించారు. మరికొన్ని చోట్ల కాలువల నిర్మాణ సమయంలో సిబ్బంది, కూలీలు నివసించేందుకు భూములు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దృష్టికి రావడంతో పెబ్బేరు పర్యటనలో జూరాల కాల్వ వద్ద ఆక్రమణలను పరిశీలించారు. జూరాల ఎస్ఈ సత్యశీలారెడ్డికి కలెక్టర్ ఫోన్ చేసి కాల్వల నిర్మాణం తర్వాత మిగిలిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు ఇవ్వాలని సూచించారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొని కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగపడే భూములు కబ్జాకు గురవుతున్నా జూరాల అధికారులు చూస్తూ ఎలా ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
చివరి ఆయకట్టుకు అందని నీరు...
జూరాల చివరి ఆయకట్టు మండలాలైన పాన్ గల్, వీపనగండ్ల, చిన్నంబావి తదితర మండలాల్లో కాల్వలు సరిగ్గా లేకపోవడంతో నాట్లు ఆలస్యం అవుతున్నాయి. ఆగస్టు నాటికి వరినాట్లు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికి నీరందడం లేదు. వేసవి కాలంలోనే కాల్వల రిపేర్లకు అధికారులు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలి. కానీ నీళ్లు వదిలే సమయంలో కాలువలకు మొక్కుబడిగా రిపేర్లు చేసి పనులు అయ్యాయని బిల్లులు ఎత్తుకుంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే జూరాల అధికారులుఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.