వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో .. అధికారులు అందుబాటులో లేరు

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నిత్యం వివిధ రకాలైన మెడికల్, సర్జికల్ వస్తువులు స్టోర్స్​ నుంచి పొందాలంటే ఇండెంట్ పుస్తకాలపై అధికారులు సంతకం కావాల్సి ఉంటుంది. 

ఇందుకోసం గురువారం వివిధ వార్డుల నుంచి నర్సింగ్ విద్యార్థులు,పేషెంట్ కేర్ సిబ్బంది, వార్డు బాయ్ ఇండెంట్ బుక్కులు పట్టుకొని అధికారుల కార్యాలయాల ముందు సంతకాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. 14 మంది అధికారులకు ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది, రోగులు ఇబ్బంది పడ్డారు. విషయం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లగా, సమస్య ఆలస్యంగా పరిష్కారమైంది.