సీఎం వస్తేనే ప్రారంభాలు.. సెప్టెంబర్లో సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ టూర్ ఉండే చాన్స్

  • సిరిసిల్లలో మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్   నిర్మాణాలు పూర్తి
  • పలు నిర్మాణాల శంకుస్థాపనకు అధికారుల ఏర్పాట్లు 
  • సీఎంతోనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించేందుకు ప్లాన్​
  •  ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనన్న  ప్రచారం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ నిర్మాణాలు పూర్తికాగా, పలు పనులు శంకుస్థాపనల కోసం ఎదురుచూస్తున్నాయి. సీఎం కేసీఆర్‌‌ వస్తేనే ఆ నిర్మాణాలను ప్రారంభించాలని అధికారులు ప్లాన్ ​చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మెడికల్ కాలేజీ, ఎస్పీ  ఆఫీస్‌, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, మరమగ్గాల షెడ్లు కంప్లీట్ అయ్యాయి. మల్కపేట రిజర్వాయర్‌‌, ఆక్వా హబ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన, కొత్తగా మంజూరైన ఇంజినీరింగ్​ కాలేజీ  నిర్మాణం.. తదితర పనుల శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే నెలలో సీఎం జిల్లాకు రానున్నారని, అప్పుడే ఈ నిర్మాణాలన్నింటినీ ప్రారంభించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్‌ నేతలు, అధికారులు ఉన్నట్లు​ తెలుస్తోంది.  

ప్రారంభోత్సవాలకు ఎదురుచూపులు

గతేడాది జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు కాగా ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. మున్సిపల్ పరిధిలోని రగుడు–-వెంకటాపూర్ బైపాస్ సమీపంలోని పెద్దూర్ వద్ద 36 ఎకరాల్లో కాలేజీని నిర్మించారు. ఈ ఏడాదే ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. హరిత హోటల్, మెడికల్​ కాలేజీ హాస్టల్ ​పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్కర్ టూ ఓనర్ పథకం కింద మరమగ్గాలతో కూడిన షెడ్ల నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇల్లందకుంట మండలంలో ఆక్వా హబ్ ఏర్పా టుకు స్థల సేకరణ పూర్తికాగా సీఎంతో శంకుస్థాపన చేయించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 కోనరావుపేట మండలం మల్కపేట వద్ద నిర్మించిన రిజర్వాయర్​  ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పెద్దూర్, రగుడు, బైపాస్‌లో నిర్మించిన ఇండ్లు ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయి రెండేండ్లు అవుతుండగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. రెండేండ్ల కింద జిల్లాకు మంజూరైన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ప్రస్తుతం అగ్రహారం డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. దీని నిర్మాణానికి తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద అధికారులు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.  జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఎస్పీ ఆఫీస్ ​కిరాయి బిల్డింగ్‌లోనే కొనసాగుతోంది. 

పొలిటికల్​ అడ్వాంటేజ్​కోసమేనా? 

సిరిసిల్లలో అభివృద్ధి పనులన్నింటినీ సీఎం కేసీఆర్ ​ఒకేసారి ప్రారంభిస్తారని అధికార పార్టీ  నాయకులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ​కూడా పలుమార్లు ప్రకటించారు.  వచ్చే ఎన్నికల్లో అడ్వాంటేజ్​ పొందేందుకు సీఎం టూర్​ ను వాడుకోనున్నారనే చర్చ నడుస్తోంది. ఎన్నికల టైం వరకు ఇలా ఒకేసారి ఓపెనింగ్​ చేయించడం కేటీఆర్‌‌కు కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.