![ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం](https://static.v6velugu.com/uploads/2025/02/officials-are-preparing-for-the-local-body-elections-in-khammam-district_XuhasCcdKZ.jpg)
- అటు అధికారులు.. ఇటు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నం
- ఈనెల15 తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ షెడ్యూల్..
- సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాల జాబితా
- కార్యకర్తలు, నేతలను సమాయత్తం చేస్తున్న పార్టీలు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు అధికారులు, మరోవైపు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎలక్షన్ ఏర్పాట్లకు సంబంధించి ఆఫీసర్లు వరుస సమావేశాలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. పార్టీలు కూడా ఎన్నికలకు తమ లీడర్లు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 11న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. అభ్యంతరాలుంటే 14న పరిష్కరిస్తారు. 15న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తారు.
దీంతో జడ్పీ అధికారులు, ఎంపీడీవోలతో కలిసి పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో 2019 ఎన్నికల్లో 289 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు కారణంగా ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. ఈసారి 288 సీట్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ స్థానాల్లో 8,64,702 ఓటర్లు ఉండగా, అనుబంధ ఓటర్ల జాబితాను సోమవారం ప్రకటించనున్నారు. దీని తర్వాత పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. కనీసం 500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 1,615 పోలింగ్ కేంద్రాలుండగా, ఈ సంఖ్య కొంత పెరిగే చాన్సుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఎన్నికల్లో 220 ఎంపీటీసీ స్థానాలుండగా, ఈసారి ఆ సంఖ్య 236కు పెరిగింది. ఇటీవల 22 ఎంపీటీసీ స్థానాలను కొత్తగా ఏర్పాటుచేయగా, 6 ఎంపీటీసీ స్థానాలను తొలగించారు. ప్రతీ మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలుండేలా మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య పెరిగింది. ఇక గత ఎన్నికల సమయంలో వేర్వేరు కారణాలతో భద్రాచలం, బూర్గంపహాడ్ మండలంలో ఎలక్షన్లు జరగలేదు. ఈసారి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో భద్రాచలంలో 14, సారపాకలో 6 ఎంపీటీసీ స్థానాలను గుర్తించారు.
ఏ క్షణమైనా సిద్ధంగా ఉండేలా..
పార్టీలు కూడా ఎన్నికలపై నజర్ పెట్టాయి. ఎలక్షన్ల షెడ్యూల్ ఏ క్షణంలో వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలను ముఖ్య నేతలు మోటివేట్ చేస్తున్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 289 ఎంపీటీసీలకు గాను 168 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 58 చోట్ల, సీపీఎం 14, సీపీఐ 7, టీడీపీ 5, ఇండిపెండెంట్లు 37 చోట్ల గెలిచారు.
జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలుండగా బీఆర్ఎస్ 17 సీట్లను గెల్చుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో అధికారపార్టీతోపాటు ఆయా పార్టీలో ఈసారి అధిక స్థానాలను గెలుసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసేందుకు ఇప్పటికే పేపర్ బండిళ్లు హైదరాబాద్ నుంచి జిల్లాలకు చేరుకున్నాయి.