భద్రాచలంలో కొత్త కరకట్ట రక్షణకు చర్యలు

భద్రాచలంలో కొత్త కరకట్ట రక్షణకు చర్యలు
  • వరదల భయంతో ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్న అధికారులు

భద్రాచలం, వెలుగు : వరదల భయంతో భద్రాచలం వద్ద కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట రక్షణకు ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రూ.38కోట్లతో కూనవరం రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కరకట్ట పనులను ఇటీవలే మొదలయ్యాయి. వర్షాలు కురుస్తుండటంతో పాటు ఎగువ నుంచి వర్షపు నీరు, పోలవరం బ్యాక్​ వాటర్​తో వరదలు భయపెట్టిస్తున్నాయి. స్లూయిజ్​నిర్మాణాలు కూడా సగం వరకు జరిగాయి. గోదావరి పొంగి వాటర్​ వస్తే మట్టికట్టకు గండ్లు పడే ప్రమాదం ఉంది. కట్టను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. కొత్త మట్టికట్ట వద్ద, స్లూయిజ్​వద్ద ఇసుక బస్తాలను రక్షణగా ఉంచుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 14 అడుగులకు చేరుకుంది. 

ఎన్​హెచ్​ అథారిటీస్​ కొర్రీలు

కరకట్ట నిర్మాణంలో భాగంగా విజయవాడ-–జగదల్​పూర్ ​జాతీయ రహదారిపై కూడా మట్టికట్ట వస్తోంది. సుమారు రూ.40కోట్ల వరకు ఖర్చు చేసి ఫ్లైఓవర్​ తరహాలో సీసీ వర్క్స్ కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఇరిగేషన్​ అధికారులు ఇప్పటికే ప్రైవేటు కన్సల్టెన్సీతో తయారు చేయించింది. వీటిని న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీస్​కు పంపించారు.

కానీ డిజైన్​పై అభ్యంతరాలు పెడుతూ అనుమతులు ఇవ్వడం లేదు. కూనవరం రోడ్డులో శివారున సరస్వతీ శిశుమందిర్​ నుంచి 500 మీటర్ల పొడవున రెండు వైపులా సిమెంట్​తో ఎత్తైన గోడలు కట్టి, ఇరువైపులా సర్వీసు రోడ్లు కూడా నిర్మించేలా ప్లాన్​ చేశారు. కానీ వరద వచ్చి నీరు నిలిచినప్పుడు రోడ్డును ఎలా కాపాడుతారంటూ? ఎన్​హెచ్​ అథారిటీస్​ డిజైన్​కు కొర్రీ పెట్టి ఆపింది. దీంతో పనులు ఆలస్యం అయ్యేలా కన్పిస్తున్నాయి. ఈ లోగా కట్టిన కట్టను కాపాడుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.