ఖమ్మంలో జీపీ ఎన్నికలకు రెడీగా.. 10 వేల మంది సిబ్బంది అవసరమని అంచనా

  • ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 
  • ఖమ్మం కార్పొరేషన్​లో విలీనమై తిరిగొచ్చిన పంచాయతీల్లో పదేళ్ల తర్వాత ఎన్నికలు 

ఖమ్మం, వెలుగు :  జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడు వచ్చినా సరే, ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వెంటనే జరుగుతాయా.. లేక స్పెషలాఫీసర్ల పాలన విధించి ఎన్నికలను వాయిదా వేస్తుందా అనే చర్చ నడుస్తోంది. జిల్లా అధికారులు మాత్రం దేనికైనా రెడీ అంటూ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వచ్చే నెలతో ఆయా పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగియనుంది. జిల్లాలో 589 జీపీలు ఉండగా, మొత్తం 5,398 వార్డులున్నాయి. వీటిల్లో ఎన్నికల నిర్వహణకు 10వేల మంది సిబ్బంది అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా సిబ్బందిని సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించారు. పంచాయతీలకు మాత్రం బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులతో నిర్వహించనున్నారు.  కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆధ్వర్యంలో కొత్త కలెక్టరేట్​ లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని జీపీల్లోని 5,398 వార్డులకు గాను, వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఎక్కువ మంది ఓటర్లున్న వార్డులకు రెండు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఆయా జీపీల్లోని ఓటర్ల సంఖ్య నిర్ధారణ అయినా తర్వాత మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్యపై క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి ఎన్నికలకు ఉపయోగించుకోవాల్సిన సిబ్బంది స్కేల్, హోదా, హోమ్ టౌన్, రెసిడెన్స్ టౌన్, ఇలా అన్ని వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వారికి ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. డేటా నమోదు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. 

పదేండ్లకు ఆ పంచాయతీల్లో ఎన్నికలు 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ లో విలీనమై మళ్లీ బయటకు వచ్చిన జీపీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదేండ్ల కింద ఖమ్మం మున్సిపాలిటీని కార్పొరేషన్​ గా అప్​ గ్రేడ్​ చేసే సమయంలో ఖమ్మం రూరల్​ మండలానికి చెందిన ఐదు గ్రామాలను అందులో విలీనం చేశారు. అప్పట్లోనే ఆయా గ్రామాల విలీనాన్ని స్థానికులు వ్యతిరేకించినా అప్పటి ప్రభుత్వ నిర్ణయం కారణంగా విలీనం పూర్తయిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామస్తులు విలీనానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికి విలీన పంచాయతీలను మళ్లీ జీపీలుగా ఏర్పాటు చేయాలన్న ఆందోళనలు ఉధృతం కావడం..  అప్పటి పాలేరు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారడం జరిగింది.

రెండోసారి బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయా గ్రామాలను మళ్లీ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు రెండున్నరేండ్ల నుంచి పెద్దతండా, గుర్రాలపాడు, చిన్నవెంకటగిరి, ఎదులాపురం, గుదిమల్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన పోలేపల్లి స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ గ్రామాల్లో గత పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలక్షన్లు జరగకపోవడంతో దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈసారి అన్ని జీపీలతో కలిపి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.