పరిహారం పంచాయితీ .. ధరల ప్రకారం చెల్లించాలంటున్న రైతులు

పరిహారం పంచాయితీ .. ధరల ప్రకారం చెల్లించాలంటున్న రైతులు
  • మంచిర్యాల– వరంగల్ హైవే 163 భూసేకరణ స్పీడప్
  • ఎకరానికి రూ.5 నుంచి రూ.8 లక్షలే చెల్లిస్తున్న ప్రభుత్వం 
  • మార్కెట్ రేటు రూ.30 నుంచి రూ.40 లక్షల పైమాటే.. 
  • లేదంటే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–వరంగల్ నేషనల్ హైవే 163 నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూముల వాస్తవ ధరలకు, ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారానికి ఏమాత్రం పొంతన లేదంటూ పెదవి విరుస్తున్నారు. ఎకరానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలుకుతుండగా, సర్కారు కేవలం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలే చెల్లిస్తోందని చెబుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం పైసలతో పది గుంటల భూమి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. భూముల వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకొని పరిహారం చెల్లించాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అరకొర పరిహారం అందించి భూములు గుంజుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

23.97 కిలోమీటర్లు.. 275 ఎకరాలు 

నాగపూర్–విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మంచిర్యాల–వరంగల్ గ్రీన్​ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. రూట్ మ్యాప్ ప్రకారం జిల్లాలోని జైపూర్ మండలం రసూల్​పల్లి, నర్వ గ్రామ శివార్ల నుంచి పౌనూర్, గోపాల్​పూర్ వరకు హైవేను నిర్మించనున్నారు. జిల్లాలో నర్వ, మిట్టపల్లి, ఎల్కంటి, టేకుమట్ల, శెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, కిష్టాపూర్, వేలాల, రొమ్మిపూర్​తో పాటు మొత్తం 14 గ్రామాల మీదుగా 23.97 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణం జరుగనుంది. దీనికోసం 275 ఎకరాల భూములు అవసరం. రెండు పంటలు పండించే వ్యవసాయ భూములను హైవే నిర్మాణం కోసం సేకరిస్తున్నారు. తరతరాలుగా తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను కోల్పోవాల్సి రావడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. 

అరకొర పరిహారంపై ఆందోళన

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతంలోని భూములకు మంచి డిమాండ్ ఉంది. గతంలో ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకగా, ఎన్​హెచ్ 163 ప్రకటనతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. మార్కెట్ వాల్యూ కేవలం రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల లోపే ఉండడంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పరిహారం పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం రేవంత్​రెడ్డికి లెటర్లు రాశారు. ఇటీవల కలెక్టర్ కుమార్ దీపక్​ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 2015–16లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి జైపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సేకరించిన భూములకు రూ.8లక్షలు చెల్లించారని, కానీ ఈ ఎనిమిదేండ్ల కాలంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు. ఇప్పుడు చెల్లిస్తున్న అరకొర పరిహారంతో గుంటల్లో కూడా భూములు కొనుగోలు చేసే పరిస్థితి లేదంటున్నారు. అయితే, ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు ఎకరానికి రూ.18 లక్షల వరకు వచ్చే చాన్స్ ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

20 గుంటలకు రూ.4.55 లక్షలే వచ్చింది

వేలాల గ్రామ శివారులోని సర్వే నంబర్ 555లో నాకు భూమి ఉన్నది. అందులోంచి హైవే కోసం 20 గుంటల భూమి తీసుకున్నరు. కేవలం రూ.4.55 లక్షల పరిహారం చెల్లించారు. ఈ పైసలతోటి హైవే పక్కన గుంట జాగ కూడా వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్ వాల్యూ కాకుండా వాస్తవ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి.3

రాజశ్రీ ప్రభాకర్, వేలాల

ఎకరం 5 గుంటలకు రూ.5లక్షలే.. 

నాకు కుందారం గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎకరం 5 గుంటలు హైవే కింద పోయింది. తరతరాలుగా మా కుటుంబానికి ఈ భూమే జీవనాధారంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.40 లక్షలు పలుకుతోంది. కానీ నాకు రూ.5.25 లక్షల పరిహారం మాత్రమే వచ్చింది. పరిహారం పెంచాలే.. లేదంటే భూమికి భూమి ఇయ్యాలె.  

సంతోషం తిరుమలరెడ్డి, కుందారం