డిగ్రీలో లక్ష సీట్లకు కోత..! సీట్ల తగ్గింపుకు త్వరలోనే ఆడిట్

డిగ్రీలో లక్ష సీట్లకు కోత..! సీట్ల తగ్గింపుకు త్వరలోనే ఆడిట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది డిగ్రీ కాలేజీల్లో భారీగా సీట్లకు కోత పడనున్నది. గతంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేటు కాలేజీల్లో సీట్ల పెంపుకు పర్మిషన్  ఇవ్వడంతో.. ప్రస్తుతం సగం సీట్లు కూడా నిండడం లేదు. ఇంటర్ పాసయ్యే విద్యార్థుల కన్నా సీట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో కోర్సులు, సీట్ల రేషనలైజేషన్‎పై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. దీనికోసం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో 1055 డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 4,57,704  సీట్లు ఉన్నాయి. అయితే, వీటిలో ఈ విద్యా సంవత్సరం 1.96 లక్షల సీట్లు (42 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.  

సర్కారు కాలేజీల్లో 61 శాతం సీట్లు నిండగా, గురుకులాల్లో 36, ప్రైవేటు కాలేజీల్లో 38 శాతం సీట్లు మాత్రమే నిండాయి. అయితే, రాష్ట్రంలో ఏటా సుమారు నాలుగు లక్షల మంది పాస్  అవుతుండగా, డిగ్రీ కాలేజీల్లో మాత్రం ఏకంగా 4.57 లక్షల సీట్లు ఉండడం గమనార్హం. పాసైన విద్యార్థులంతా డిగ్రీలోనే చేరినా.. ఇంకా సీట్లు మిగిలిపోతాయి. ఇవేవీ పట్టించుకోని అధికారులు ఇష్టానుసారం  సీట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఇటీవలే హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్ అధికారులు డిగ్రీ కాలేజీల్లో సీట్లు, భర్తీపై సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న సీట్లలో సగం కూడా నిండకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2025–26) మాత్రం స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా సీట్లలో కోతలు పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లోని మూడేండ్ల డేటాను అధికారులు సేకరిస్తున్నారు. 

కాలేజీల్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని భర్తీ అవుతున్నాయి, ఏఏ కోర్సులకు డిమాండ్  ఉందనే వివరాలు తెప్పించుకుంటున్నారు. దీనికితోడు డిగ్రీలో సీబీసీఎస్ (బకెట్ సిస్టమ్) విధానం అమలు చేస్తుండటంతో నాలుగు వందలకు పైగా కోర్సులున్నాయి. వీటిలో సగం కోర్సుల్లో సీట్లు నిండడం లేదని అధికారులు గుర్తించారు. కొత్త సిలబస్ రానున్న నేపథ్యంలో ఆయా కోర్సులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అన్ని కాలేజీల్లోని కోర్సులు, సీట్లపై ఆడిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆడిట్​ చేస్తున్నం

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోని అవసరానికి మించి సీట్లు ఉన్నాయి. సగం సీట్లు కూడా నిండడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం అలాంటి సమస్య లేకుండా ప్రయత్నాలు చేస్తున్నం. దీనికోసం త్వరలోనే ఆడిట్ ప్రక్రియ చేపడుతాం. 
 – బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్ఈ చైర్మన్