
- జూ’లో జంతువులు చల్లచల్లగా..!
- ఎన్ క్లోజర్ల వద్ద ఏసీలు, కూలర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు
- పక్షుల గూళ్లు, జంతువుల ఆవాసాలపై తుంగ గడ్డి
- నిషాచర జీవులకు ఏసీలు
- ఏనుగులకు పెద్ద పాండ్స్, రెయిన్‌గన్స్
- వేసవి తాపం నుంచి జంతువులకు ఉపశమనం
హైదరాబాద్ సిటీ, వెలుగు:ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎండల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ జూపార్క్‌లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఇచ్చే నీళ్ల నుంచి ఆహారం దాకా అన్నిట్లో మార్పులు చేశారు. ఎన్ క్లోజర్ల వద్ద ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. వెటర్నరీ డాక్టర్లు నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక చర్యలు జూన్ వరకు కొనసాగుతాయని జూపార్క్ అధికారులు తెలిపారు.
వాటర్ లో గ్లూకోన్ డీ.. ఫుడ్ లో సిట్రస్ ఫ్రూట్స్
నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఆహారంగా ఇస్తున్నారు. అలాగే తాగే నీళ్లలో సప్లిమెట్స్ యాడ్ చేసి ఇస్తున్నారు. దీంతో యానిమల్స్ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. జంతువులకు ఇచ్చే ఆహారంలో ఎక్కువగా వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, సిట్రస్ పండ్లను ఇస్తున్నామన్నారు. పక్షులకు నీళ్లలో, ఆహారంలో గ్లూకోన్ డీ, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్ సీ సప్లిమెంట్స్, థర్మోకేర్ లిక్విడ్స్ ను కలిపి ఇస్తున్నారు.
గూళ్లపై ఎండ ప్రభావం పడకుండా చర్యలు
జంతువుల ఆవాసాలు, పక్షుల గూళ్లపై ఎండ ప్రభావం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జూపార్క్ అధికారులు వెల్లడించారు. పక్షలు గూళ్లను తుంగ గడ్డితో కప్పి, రోజుకు మూడు నాలుగుసార్లు నీళ్లతో తడుపుతున్నట్లు చెబుతున్నారు.
అలాగే సందర్శకులు ఎండలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొబ్బరి మట్టలు, తాటిమట్టలతో షెడ్లను నిర్మించినట్లు తెలిపారు. అలసిపోయిన సందర్శకులు వాటి కింద సేద తీరేలా నీరు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే, కొంగలు, బాతుల కొలనులో షేడ్ నెట్స్ ఏర్పాటు చేశారు. ఎండ నేరుగా ఎన్ క్లోజర్లను చేరకుండా కష్ కష్ తట్టీలు ఏర్పాటు చేశారు. వేడిని ఆపేందుకు రోజుకు నాలుగైదు సార్లు తట్టీలను, తుంగ గడ్డిని నీళ్లతో తడుపుతున్నారు.
ఏసీలు, కూలర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు..
జాపార్క్ లోని జంతువుల ఎన్ క్లోజర్లు గుహ ఆకారం పోలి ఉంటాయి కాబట్టి లోపలా వేడిగా ఉంటుంది. రెప్టైల్స్ హౌజ్ లో ఇసుక ఉండడంతో మధ్యాహ్న సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. వాటికి ఉపశమనం కల్పించేలా నిషాచర జీవులు ఉండే హౌజ్ లో ఏసీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. రెప్టైల్ హౌజ్ లో ఫాగర్ లను ఏర్పాటు చేశారు.
సింహం, చిరుత, టైగర్, చింపాంజీ, కోతుల ఎన్ క్లోజర్లలో కూలర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంక్లోజర్ల దగ్గర చిన్న రేయిన్ గన్ లను అమర్చారు. వీటిద్వారా ఎండలను నుంచి జంతువులు చాలా వరకు ఉపశమనం పొందుతాయని జూపార్క్ అధికారులు భావిస్తున్నారు.