మత్తుకు బానిస కావద్దు.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

మత్తుకు బానిస కావద్దు.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
  •     మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధికారులు, పోలీసుల పిలుపు
  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞలు

నెట్​వర్క్, వెలుగు: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అధికారులు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. మంచిర్యాలను గంజాయి, మత్తు పదార్థాల రహిత జిల్లాగా సమష్టిగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. 

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, ఏసీపీ ప్రకాశ్, డీఈఓ యాదయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్మల్​జిల్లా కేంద్రంలో చేపట్టిన అవగాహన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్​అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ‘డ్రగ్స్​ను నిర్మూలిద్దాం.. యువతను కాపాడుదాం’, ‘డ్రగ్స్​ను పక్కన పెట్టు.. జీవితాన్ని గాడిలో పెట్టు’ అనే నినాదాలతో ర్యాలీ సాగింది. ఆర్డీఓ రత్న కల్యాణి, డీడబ్ల్యూఓ నాగమణి, డీఈవో రవీందర్ రెడ్డి, డీఎంహెచ్ఓ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్​ రహిత సమాజం తయారు కావాలి

డ్రగ్స్ రహిత సమాజం తయారు కావాలని ఆసిఫాబాద్ జిల్లా జడ్జి ఎంవీ రమేశ్ అన్నారు. మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. యువత 3 ఎల్ (లవ్, లస్ట్, లిక్కర్) పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మాదకద్రవ్యాలు యువతపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని, కోర్టుకు వచ్చే అనేక కేసులు మాదకద్రవ్యాలతో ముడిపడినవేనని గుర్తుచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

యువత మత్తుకు దూరంగా ఉండాలి 

ఆదిలాబాద్​పట్టణంలోని వివిధ కాలేజీల విద్యార్థులతో కలెక్టరేట్​ చౌక్​ నుంచి వినాయక్ ​చౌక్ ​వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్పీ గౌస్ ఆలం జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తామని, డ్రగ్స్ కి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్​ఎస్పీ బి.సురేందర్​రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్మిక వాడల్లో చేపట్టిన ర్యాలీలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఏరియా జీఎం మనోహర్, సీఐ శశిధర్​రెడ్డి పాల్గొన్నారు. బజార్​హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన చేపట్టి మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. 

జైపూర్​లో ఏసీపీ వెంకటేశ్వర్, లక్సెట్టిపేటలో సీఐ నరేందర్, చెన్నూర్​లో సీఐ రవీందర్, శ్రీరాంపూర్ లో సీఐ మోహన్, బజార్​హత్నూర్​లో సీఐ రమేశ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ రవికుమార్, దండేపల్లిలో ఎస్ఐ భూమేశ్, లక్ష్మణచాందలో ఎస్ఐ సుమలత, కోటపల్లిలో ఎస్​ఐ రాజేందర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టారు. డ్రగ్స్​కు దూరంగా ఉంటామని యువత, స్టూడెంట్లతో ప్రతిజ్ఞ చేయించారు.