ఖమ్మం జిల్లాలో డబుల్ పెన్షన్లకు చెక్!

ఖమ్మం జిల్లాలో డబుల్ పెన్షన్లకు చెక్!
  •   ‘ఫ్యామిలీ’ పెన్షన్​ తీసుకుంటున్న వారికి ‘ఆసరా’
  •     ఉమ్మడి జిల్లాలో 427 మంది ఉన్నట్టు గుర్తింపు 
  •     ఇప్పటికే నోటీసులు పంపించిన ఆఫీసర్లు 
  •     ఉన్నతాధికారుల ఆదేశాలతో కొత్త నోటీసులకు బ్రేక

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబుల్ పెన్షన్లకు అధికారులు చెక్​పెట్టారు. రిటైర్​మెంట్ తర్వాత పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్​ తో పాటు ఆసరా పెన్షన్ తీసుకోవడంపై నజర్​ పెట్టారు. నిన్న మొన్నటి వరకు అలా అనర్హులకు అందిన ఆసరా పెన్షన్లను రికవరీ చేసేందుకు అధికారులు పూనుకొగా.. రికవరీకి ఇప్పుడే చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్ల రికవరీకి తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని చీఫ్​ సెక్రటరీ సూచించారు.

దీంతో కొత్తగా నోటీసుల జారీ అధికారులు ఆపేశారు. ఇకపై ఫ్యామిలీ పెన్షన్​ తీసుకుంటున్న వారికి ఆసరా పెన్షన్​ అందకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరికి ఒక పెన్షన్​ మాత్రమే అందేలా ప్లాన్​ చేశారు. 

427 మంది ‘కి డబుల్’ పెన్షన్లు

రిటైర్​మెంట్ అయిన తర్వాత పెన్షన్​ తీసుకుంటున్న వారు కొందరు, రిటైర్​ అయిన భర్త చనిపోతే ఫ్యామిలీ పెన్షన్​ తీసుకుంటున్న వారు కొందరు ఒంటరి మహిళ పెన్షన్​ కూడా తీసుకుంటున్నట్టు ఇటీవల సెర్ప్​ అధికారుల ఎంక్వైరీలో గుర్తించారు. ఇలాంటివారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 427 మంది ఉన్నట్టు తేలింది. వారికి ఆసరా పెన్షన్ రూపంలో రూ.2.5 కోట్లు అందినట్టు లెక్కతేల్చారు. వారి నుంచి ఆసరా పెన్షన్​ గా పొందిన మొత్తాన్ని రికవరీ చేసేందుకు గత వారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జూన్​ నెల నుంచి అలా డబుల్ పెన్షన్​ పొందుతున్న వారికి ఆసరా పెన్షన్​ ను నిలిపివేశారు.

నోటీసులు అందిన వారంలోపు తిరిగి చెల్లించకపోతే, ఫ్యామిలీ పెన్షన్​ ను నిలిపేస్తామని ఆఫీసర్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో కొంతమంది తిరిగి చెల్లించారని, ఇంకా 90 శాతం మంది కట్టాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈలోపు రికవరీకి సంబంధించి నోటీసులు ఇవ్వొద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు అందడంతో తాత్కాలికంగా బ్రేక్​ వేశారు. 

అర్హులకే డబ్బులు అందేలా...

రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, డయాలసిస్​, పైలేరియా బాధితులు, ఎయిడ్స్​ రోగులకు ఆసరా పథకం కింద ఆర్థిక సాయం చేస్తోంది. తెల్ల రేషన్​ కార్డున్న వాళ్లు మాత్రమే అర్హులు కాగా, గత ప్రభుత్వ హయాంలో కొంత మంది అనర్హులను కూడా రాజకీయ కారణాలతో లబ్ధిదారులుగా ఎంపిక చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారిని తప్పించేందుకు ఆఫీసర్లు ఇటీవల డబుల్ పెన్షన్ల వ్యవహారంపై నజర్​ పెట్టారు. ఎన్నికలకు ముందు హామీనిచ్చిన విధంగా ‘చేయూత’ పేరుతో పెన్షన్లను రూ.4వేలకు పెంచే పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

దీనిలో భాగంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లేకుండా అర్హులకు మాత్రమే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నారువారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు కూడా ఆసరా పెన్షన్ పొందుతున్నట్టు ఉన్నారని ఆఫీసర్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే 2021లో పెన్షన్​ దారుల కోసం ప్రత్యేక యాప్​ ను రూపొందించారు. ఆ యాప్​ లో లబ్ధిదారుల ఆధార్​ నంబర్​ నమోదు చేస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి అందుతున్న పథకాల గురించి వివరాలు తెలిసేలా తయారు చేశారు.

దీంతో అత్యధికంగా ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో 139 మంది అనర్హులు ఉండగా, మండలాలు, మున్సిపాలిటీల వారీగా జాబితాలను అధికారులకు అందించారు. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి ఇచ్చిన వారం రోజులు గడువు ముగిసినా, కేవలం పది శాతం లోపు మాత్రమే స్పందించారు. ప్రస్తుతానికి రికవరీని నిలిపివేయగా, తర్వాత ప్రభుత్వ ఆదేశాలను బట్టి తుది నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.