మెట్ పల్లి పట్టణాల్లో ముక్కిన పప్పు .. కుళ్లిన మాంసం

మెట్ పల్లి పట్టణాల్లో ముక్కిన పప్పు .. కుళ్లిన మాంసం
  •  హాస్టల్స్, రెస్టారెంట్, హోటల్స్ అధ్వాన్నం 
  • ఫిర్యాదు వస్తే తప్పా.. స్పందించని  అధికారులు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రం తో పాటు కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు హాస్టళ్లలో ఆహారం కల్తీ అవుతోంది. వీటిపై కస్టమర్లు ఫిర్యాదులు చేస్తే తప్పా.. అధికారులు స్పందించడం లేదు. తనిఖీలు చేసినా ఒకటి, రెండు ప్రాంతాల్లో చేసి,  నామమాత్రపు ఫైన్లతో మమా అనిపిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఆహారం కల్తీపై ఏకంగా జిల్లా కలెక్టర్​ సత్య ప్రసాద్​ స్పందించే వరకు జిల్లా అధికారులు కదలలేదు. కలెక్టర్​ ఆదేశాల మేరకే జగిత్యాలలో అధికారులు తనిఖీ చేశారు. 

పైన హంగులు.. లోపల వ్యర్థాలు.. 

హోటళ్ల నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు పైకి కనిపించేలా కలర్​ఫుల్​ బోర్డులు పెడుతున్నారు. కానీ, కిచెన్లు మాత్రం అధ్వాన్నంగా నిర్వహిస్తున్నారు. కాస్ట్లీ సోఫాలు, ఖరీదైన కుర్చీలు పెట్టినా ఫుడ్​ క్వాలిటీ మాత్రం ఛీప్​గా ఉంటోంది. ఇటీవల అధికారులు చేసిన తనిఖీలో హోటళ్లు, రెస్టారెంట్ల తోపాటు  హాస్టళ్లలో సైతం ముక్కిన పప్పు, కుల్లిన మాసం నిల్వలు బయటపడ్డాయి. పురుగు పట్టిన రవ్వ, ముక్కిన మీల్స్​ మేకర్​, కుల్లిపోయిన మరిన్ని ఆహార పదార్ధాలు దొరికాయి. కిచెన్ లో తీవ్ర దుర్వాసన వెదజల్లడం తో ఆహార పదార్ధాలను బయట పారబోశారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నా ఫుడ్​సేఫ్టీ అధికారులు సరైన తనిఖీలు చేయట్లేదన్న విమర్శలు ఉన్నాయి. 

కుళ్లిన పదార్థాలు.. 

హాస్టళ్లలో ఉప్మా రవ్వ, మీల్​మేకర్, గోధుమ పిండి, ముక్కి పురుగులు పడుతున్నాయి. శ్రీ చైతన్య హాస్టల్​లో కంది పప్పు,చింత పండు, అల్లం వెల్లుల్లి పూర్తిగా పాడవడంతో వాటిని ఆధికారులు పారేశారు.  

పట్టించుకోని అధికారులు.. 

చాలా హోటళ్లలో ఆహారం కల్తీ జరుగుతున్నా అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు ఫుడ్​ సెంటర్లలో , ప్రైవేటు హాస్టళ్లలో నిర్వహణ సరిగ్గా లేదు. ప్రైవేట్​ హాస్టళ్లలో ఆహారం నాణ్యంగా లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమర్షియల్ సిలండర్లు వాడకుండా డెమెస్టిక్ సబ్సిడీ సిలండర్లు  వాడినా ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడం పై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి

ఇవీ ఘటనలు .. 

  • జగిత్యాల బైపాస్ రోడ్ లో ని గ్రాండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కాలం చెల్లిన, పురుగు పట్టిన నువ్వులు, బియ్యం, పప్పులను గుర్తించి ఫైన్​ వేశారు. 
  • జాబితాపూర్ లో శ్రీ చైతన్య స్కూల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి పిల్లలకు వడ్డించే భోజనం లో కాలం చెల్లిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసి ల్యాబ్ కు పంపించారు.
  • పట్టణంలోని ప్రైవేట్​ హాస్టళ్లలో ఇదే తీరు ఉంది. హాస్టళ్లలో ఉండేవారు ఇదేంటని ప్రశ్నించినా.. నిర్వహకులు పట్టించుకోవడంలేదు. 
  • ఇటీవల కోరుట్ల లో అధికారులు దుకాణాలు, హోటల్స్ లో తనిఖీ చేశారు. చెడిపోయిన వంట నూనె, ఫ్రిజ్ లో నిల్వ చేసిన నాసిరకం ఆహార పదార్ధాలు బయటపడ్డాయి. 
  • ఆరు నెలల క్రితం మెట్ పల్లిలో రెస్టారెంట్ లో బల్దియా అధికారుల తనిఖీలు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి రు. 10 వేలు ఫైన్ వేసి వదిలేశారు. అప్పటి నుంచీ మళ్లీ తనిఖీలపై అధికారులు దృష్టిపెట్టలేదు. 

కఠిన చర్యలు తప్పవు

జిల్లా లో ముప్పై ఫుడ్ రెస్టారెంట్లు, హోటల్స్, హాస్టల్స్ కు ఫైన్స్ వేశాం. అలాగే మరో ఏడింటిపై   కేసులు నమోదు చేశాం. ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డిపార్ట్​మెంట్​  షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేపడుతున్నాం. ఫుడ్ విషయం లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవు.

 ఫుడ్ ఇన్ స్పెక్టర్ అనూష, జగిత్యాల జిల్లా