సూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత

సూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత

ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసాగనుంది. ఈ సమయంలో సూర్యుడు 43 శాతం అస్పష్టంగా కనిపించనున్నాడు. సూర్య గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. 

సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ ఉదయం 8:50 గంటల నుంచి రేపు ఉదయం 10:30 గంటల వరకు దర్శనాలు, సేవలు రద్దు చేశారు. నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవంతోపాటు రేపు స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను అధికారులు రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత ఉదయం  10:30 గంటలకు గుడిని తెరవనున్నారు. అనంతరం నిత్య కైంకర్యాలు, భక్తుల దర్శనం కొనసాగనుంది. 

వేములవాడ  రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సైతం ఆలయ అధికారులు మూసివేశారు. గ్రహణం అనంతరం సాయంత్రం 6గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. సాయంత్రం 8 గంటల నుండి భక్తులను యధావిధిగా దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేసిన అధికారులు.. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం తెరవనున్నారు. సూర్య గ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజన్న ఆలయంలోనూ దర్శనంతో పాటు అన్ని సేవలు రద్దు చేశారు. కీసర గుట్ట ఆలయంలో ఉదయం 7:30 లకు మొదటి పూజ అనంతరం ఆలయ అధికారులు గుడి మూసివేశారు. రేపు ఉదయం 8:30లకు ఆలయం తెరవనున్నారు. గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ టెంపుల్లోనూ ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అర్చకులు ప్రకటించారు. 

సూర్య గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూతపడనుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 8 గంటలన నుంచి సర్వ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. గ్రహణం కారణంగా నేడు అన్న ప్రసాద వితరణను కూడా అధికారులు రద్దు చేశారు. శ్రీశైలం దేవస్థానంలోనూ స్వామి, అమ్మవార్లకు మంగళహారతుల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 6.30గంటలకు గుడి తలుపులు తెరచి ఆలయ శుద్ది, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గ్రహణం కారణంగా ఆర్జిత, శాశ్వత సేవలతో పాటు అన్న ప్రసాద వితరణ నిలిపివేశారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. అయితే ఈ రోజు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. సూర్యగ్రహణం నేపథ్యంలో కాణిపాకం ఆలయాన్ని ఉదయం 8గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు మూసివేయనున్నారు. 

 

ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని   సూర్యగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం పూర్తయిన తర్వాత  భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ ప్రధానార్చకులు వెల్లడించారు.

సూర్యగ్రహణం సందర్భంగా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని ఈరోజు ఉదయం నుండి రేపు ఉదయం 9 గంటల వరకు వరకు మూసివేయనున్నట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. 

సూర్యగ్రహణం సందర్భంగా కొండగట్టు  ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా  ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి యధావిధిగా దర్శనాలు పునః ప్రారంభం కానున్నాయి. 

సూర్యగ్రహణం‌ సందర్భంగా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను  ఆలయ అధికారులు మూసివేశారు.  సంప్రోక్షణ కార్యక్రమాల‌‌ అనంతరం రేపు ఉదయం 7 గంటల నుండి  దర్శనాలకు అనుమతించనున్నారు. 

సూర్యగ్రహణం‌ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సంప్రోక్షణ కార్యక్రమాల‌‌ అనంతరం రాత్రి 7 గం.నుండి భక్తులకు దర్శానానికి అనుమతి ఇవ్వనున్నారు.