గ్రేటర్ లో నేడే గణేశ్​ నిమజ్జనం

గ్రేటర్ లో నేడే గణేశ్​ నిమజ్జనం
  • 23 ప్రాంతాల్లో ఏర్పాట్లు
  • కోట చెరువులో ఈసారి నిమజ్జనం బంద్​
  • ట్రైసిటీలో 22 గంటలు ట్రాఫిక్​ ఆంక్షలు

వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్​లో నేడు వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విగ్రహాల ఎత్తు, ఏరియాకు అనుగుణంగా నిమజ్జనం ప్రాంతాలను ఎంపిక చేశారు. మహానగరంలో మధ్యాహ్నం నుంచే ప్రధాన రోడ్లపై ఆంక్షలు విధించారు. జిల్లాకు వచ్చే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లేలా రూట్​మ్యాప్​రూపొందించారు.  

కోట చెరువు బదులుగా చిన్న వడ్డెపల్లి చెరువు..

వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో ఈ ఏడాది దాదాపు 5400 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు వరంగల్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీసులు తెలిపారు. ఇందులో 4500 పోలీస్ పోర్టల్లో నమోదవగా, మరో 900 అపార్ట్​మెంట్లు, ఆలయాల్లో ప్రతిష్టించినట్లు తెలిపారు. సిటీలోని వినాయకులను ఎత్తు, వెడల్పు ఆధారంగా మూడు రకాలుగా విభజించి, నిమజ్జనానికి 23 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.

8 ఫీట్ల వరకు హనుమకొండ సిద్దేశ్వర గుండం, మిడిల్ సైజ్ కాజీపేట బంధం చెరువు, పెద్దవాటిని వరంగల్ చిన్న వడ్డెపల్లి చెరువులో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇవే కాకుండా కట్టమల్లన్న చెరువు, ఉర్సు గుట్ట రంగం చెరువు, బెస్తం చెరువు, అగర్తల చెరువు, మామునూర్ పెద్ద చెరువు, చల్లా చెరువు, భీమారం, హసన్​పర్తి చెరువులు వంటివి ప్రధానంగా ఉన్నాయి. గతంలో నగరంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ పెద్దమ్మగడ్డ దాటాక హనుమాన్ జంక్షన్​లోని కోట చెరువులో నిమజ్జనం చేసేవారు.

ఈసారి కోట చెరువులో నిమజ్జనం చేయకూడదని నేషనల్  గ్రీన్​ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు పెద్ద విగ్రహాలన్నీ దేశాయిపేట సీకేఎం కాలేజీ జంక్షన్​లోని చిన్న వడ్డెపల్లి చెరువులో నిమజ్జనం చేయాలని ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు.

ఇనుప బొంగులను  వాడకూడదు 

ఖిలా వరంగల్(కరీమాబాద్): వరంగల్ సిటీలో వినాయక నిమజ్జనానికి ఇనుప బొంగులను వాడకూడదని విద్యుత్ శాఖ ఇన్​చార్జి డైరెక్టర్ మధుసూదన్, ఎస్ఈ మధుసూదన్ రావు అన్నారు. ఆదివారం వరంగల్ లోని పలు నిమజ్జన ప్రదేశాలను ఆయన సందర్శించి, లైటింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్​శాఖ కంట్రోల్ రూం నెం. 7901628362 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


ట్రాఫిక్​ ఆంక్షలు..

సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్​ఆంక్షలు విధించారు. వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా నిమజ్జనానికి శోభాయాత్రగా తరలిరానున్న నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధి మెయిన్ రోడ్లపై ఆంక్షలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. 


  ములుగు, భూపాలపల్లి వైపు నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి, పరకాల నుంచి ఖమ్మం వెళ్లేవారు ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు మీదుగా వెళ్లాలి.


  భూపాలపల్లి, పరకాల నుంచి నర్సంపేట వైపు వెళ్లేవారు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్​పీరీలు, గొర్రెకుంట మీదుగా వెళ్లాలి.
  గ్రేటర్ సిటీ లోపలికి వచ్చే భారీ వాహనాలకు అనుమతి లేదు. 


సిటీలో..


  ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ, కేయూసీ, సీపీవో, అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండుకు చేరుకోవాలి.


  హనుమకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీవో, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.


  హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి.


  వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి, రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హనుమకొండకు చేరుకోవాలి.


నిమజ్జన వాహనాల కోసం..

  సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేసే విగ్రహాలు 6 అడుగుల ఎత్తువరకు ఉండాలి. ట్రాక్టర్, టాటా ఏస్ వెహికల్స్ మాత్రమే అనుమతిస్తారు. వినాయక శోభాయాత్ర హంటర్ రోడ్, అదాలత్, సీపీవో, హనుమకొండ చౌరస్తా, బాలాంజనేయ స్వామి టెంపుల్ మీదుగా నిమజ్జనం వద్దకు వెళ్లి, శాయంపేట మీదుగా తిరిగి వెళ్లాలి.


  హనుమకొండకు చెందిన భారీ వినాయక విగ్రహాలు వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయాలి.


  ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కాజీపేట దర్గా సమీపంలోని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.


  చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసే విగ్రహాలు కాశీబుగ్గ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట మీదుగా వెళ్లి, నిమజ్జనం తర్వాత ఎనుమాముల మార్కెట్, కాశీబుగ్గ మీదుగా తిరిగి వెళ్లాలి.