
- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
- వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాభవానీ మాత జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు ఏడుపాయల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా మహా శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. స్టేట్ ఫెస్టివల్‌గా నిర్వహించే జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల రద్దీకి తగ్గట్టు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
వరుస రివ్యూలు
ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న జాతర నిర్వహణ, భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలపై కలెక్టర్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆయా శాఖల అధికారులతో ఇదివరకే వరుసగా రివ్యూ మీటింగ్‌లు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో వారం రోజుల నుంచే ఎండోమెంట్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, హెల్త్, ఫిషరీస్, పోలీస్ శాఖలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
క్యూ లైన్లు.. చలువ పందిల్లు
జాతరకొచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనాల కోసం వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచి ఆలయానికివెళ్లే దారిలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసేందుకోసం 13 షవర్ బాత్‌లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం జాతర ప్రాంగణంలో వివిధ చోట్ల 350 నల్లాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి దూరంగా బసచేసే భక్తులకు తాగునీటిని సప్లై చేసేందుకు 20 ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. 50 పర్మినెంట్ మరుగుదొడ్లకు రిపేర్‌చేసి నీటి వసతి కల్పించడంతో పాటు, 328 టెంపరరీ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
130 మంది గజ ఈతగాళ్లు
భక్తులు మంజీరా నదిపాయల లోతు తెలియక స్నానాలు చేసేటప్పుడు నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉంది. వారిని కాపాడేందుకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనదుర్గా ప్రాజెక్ట్, చెక్‌డ్యాం, నదీపాయల వద్ద 130 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. జాతర ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చూసేందుకు పంచాయతీ డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో 835 మంది సిబ్బందిని నియమించారు. జాతర ప్రాంగణాన్ని ఐదు సెక్టార్లు, 40 సబ్సెక్టార్లు గా విభజించి సిబ్బందికి డ్యూటీలు కేటాయించారు.
ఎప్పటికపుడు చెత్త తొలగించేందుకుగాను 640 మంది పారిశుద్ద్య సిబ్బందిని, పర్యవేక్షణకు 160 మంది సూపర్ వైజర్లను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు ఆర్టీసీ 157 స్పెషల్ బస్సులు నడుపుతోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్, బాలానగర్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట, చేగుంట నుంచి ఏడుపాయలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.
మెడికల్ క్యాంప్
జాతరకొచ్చే భక్తులకు అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్, 10 ఫస్ట్ ఎయిడ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 4 అంబులెన్స్‌లు, రెండు 104 వెహికిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. డాక్టర్లు, పారామెడికల్ స్టాప్, ల్యాబ్ టెక్నిషియన్స్, ఫార్మసిస్ట్‌లు కలిపి మొత్తం 257 మంది మెడికల్ స్టాఫ్ జాతరలో అందుబాటులో ఉంటారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..