నల్గొండ అర్భన్, వెలుగు : యాదాద్రి, నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి వరకూ అధికారులు పలు రైస్ మిల్లుల్లో దాడులు నిర్వహించారు.నల్లగొండ పట్ణణంలోని రాం లక్ష్మణ్ పారబోయిల్డ్ రైస్ మిల్లుతో పాటు ఆ మిల్లు గోడౌన్ లో జిల్లా అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశాల ప్రకారం అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఏఎంసీ తిప్పర్తిలోని రెండు గోదాంలు, అర్జాల బావి గోదాం5, మర్రిగూడ గోదాం లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 2022 నుంచి 2023 వరకు ఖరీఫ్, అలాగే రభీ సీఎంఆర్ బియ్యం స్టాక్ వివరాలు పరిశీలించారు. ఈ తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పీడీఎస్ రైస్‌ను రీ సైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, సివిల్ సప్లై శాఖ పని తీరును మెరుగు పరుస్తామని సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో నిర్వహించిన మీటింగ్ తర్వాత.. గంటలు గడవకముందే అధికారులు స్పందించి, తనిఖీలు నిర్వహించారు.
యాదాద్రి : సీఎంఆర్ మిల్లుల్లో వడ్ల నిల్వలపై సివిల్ సప్లయ్ అధికారులు నజర్ పెట్టారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్‌కు చెందిన మిల్లులో బుధవారం తనిఖీలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎంఆర్‌తో పాటు రేషన్ బియ్యంపై వరుసగా రివ్యూలు నిర్వహించారు.
ప్రజాపాలనపై జిల్లా హయ్యర్ ఆఫీసర్లు రివ్యూ నిర్వహిస్తున్న సమయంలోనే.. హైదరాబాద్ నుంచి వడ్ల నిల్వల తనిఖీలపై ఆర్డర్స్ వచ్చినట్టుగా సమాచారం. దీంతో హుటాహుటినా జిల్లా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మూడు టీంలు తనిఖీలకు బయలుదేరాయి.
టెక్నికల్ అసిస్టెంట్లతో కూడిన ఈ టీంలు బీబీనగర్‌లో ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్‌కు చెందిన కాదంబరీ రైస్ మిల్లుకు వెళ్లి తనిఖీలు చేపట్టాయి. మిల్లులో రికార్డులను స్వాధీనం చేసుకొని అధికారులు పరిశీలించారు. మిల్లుల్లో బస్తాలు లెక్కించేందుకు వీలు లేకుండా ఉన్నాయని తెలుస్తోంది. వడ్ల బస్తాల లెక్కింపు ఆలస్యమవుతోందని , చీకటిపడడంతో లెక్కింపు ఆపేశారని, మిల్లులోని వడ్ల నిల్వ లెక్కింపు గురువారం కూడా జరుగుతోందని సమాచారం.
బీఆర్ఎస్ అండతో..
ఏండ్ల తరబడి రైస్ మిల్లర్స్ స్టేట్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న గంపా నాగేందర్ గత ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవరించారన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారని తోటి మిల్లర్లు చెబుతున్నారు. తాను ఫోన్ చేస్తే.. సీఎం కేసీఆర్ వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పుకుంటూ జిల్లా ఆఫీసర్లనే లెక్క చేయకుండా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఆయన మిల్లుల వైపు ఎవరూ చూడడానికి సాహసించలేదని అంటుంటారు. గత సీజన్లో ఏకంగా స్థానికంగా పండిన వడ్లు నాణ్యతగా లేవని, తనకు ఖమ్మం జిల్లాలో పండిన వడ్లనే తీసుకుంటానంటూ మెలికపెట్టి మరీ అక్కడి వడ్లు తన మిల్లుకు సీఎంఆర్‌గా తెప్పించుకున్నారు.