సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలను బల్దియా సిబ్బంది కూల్చివేశారు. ఎర్ర చెరువు బఫర్ జోన్ లో ఇంటి నిర్మాణానికి కూల్చివేయడానికి నాలుగు బాంబులను ఉపయోగించినా ఒక్కటి మాత్రమే పేలింది. దీంతో డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించి పిల్లర్లను, స్లాబ్ ను పాక్షికంగా కూల్చివేశారు.
ఐదో వార్డులో తప్పుడు ధృవపత్రాలను సమర్పించి అనుమతులు పొంది గృహ నిర్మాణం చేపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పత్రాలను పరిశీలించి పోలీసుల సమక్షంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాల్టీ పరిధిలో గృహ నిర్మాణం చేపట్టే వారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవరాజు, నస్రీన్ భాను, స్రవంతి , ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.