రంగారెడ్డి, జీహెచ్ఎంసీలో షురూ కానీ ప్రజావాణి

రంగారెడ్డి, జీహెచ్ఎంసీలో షురూ కానీ ప్రజావాణి
  • రంగారెడ్డి, జీహెచ్ఎంసీలో షురూ కానీ ప్రజావాణి
  • కరోనా తగ్గుముఖం పట్టినా ప్రజావాణి నిర్వహించని అధికారులు
  • ప్రజావాణితో ప్రజల సమస్యలకు త్వరగా పరిష్కారం దొరికే అవకాశం 

 

హైదరాబాద్, వెలుగు: కరోనా తర్వాత రాష్ట్రమంతటా జిల్లాల్లో  ప్రజావాణి షురువైనా రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాలు, బల్దియాలో మాత్రం పెట్టట్లేదు. కరోనా కారణంగా 2020 మార్చి 17న  ప్రజావాణి బంద్​ పెట్టారు. దీంతో రెండేండ్లుగా ప్రజలు తమ సమస్యలపై చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. బల్దియా ఆఫీసుకు వెళ్తుంటే లోపలికి కూడా అనుమతించట్లేదు. 

గతంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఉన్నతాధికారులు స్వీకరించి విచారణ చేపట్టేవారు. పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించేవారు. లేదంటే తక్షణమే బాధితులకు న్యాయం చేసేవారు. కరోనాకు ముందు డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో 30 , జోనల్​స్థాయిలో 50, హెడ్డాఫీసులో ప్రజావాణికి 100 వరకు ఫిర్యాదులు వచ్చేవి. గ్రేటర్ ​మొత్తంలో వెయ్యికిపైగా ఉండేవి. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లలో 100కు పైగానే వస్తుండేవి. వందలాది మంది బాధితులకు తక్షణమే పరిష్కారం దొరికేది. కరోనా తర్వాత బంద్​పెట్టిన ప్రజావాణిని మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై మాత్రం అధికారులు చెప్పట్లేదు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆన్​లైన్​లో చేయండని సలహా అయితే ఇచ్చేస్తున్నారు. హెల్ప్​ లైన్​ నంబర్​, మై జీహెచ్ఎంసీ యాప్​, ట్విట్టర్, డయల్​ 100కు  ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకట్లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజావాణి నిర్వహించాలని సిటీ జనాలు కోరుతున్నారు. 

మొన్న పడిన వానకు ఇండ్లలోకి వరద చేరడంతో ఇబ్బందులు పడిన యాకుత్​పురాకు చెందిన 200 మంది ప్రజలు మంగళవారం బల్దియా హెడ్డాఫీసు ముందు ఆందోళనకు దిగారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించడంతో  బల్దియాకు నోటీసులు జారీ చేసింది. అదే ప్రజావాణి ఉండి ఉంటే, అక్కడికి వెళ్తే సమస్యకు పరిష్కారం దొరికేది.

రాష్ట్రంలోని జిల్లాల్లో నెల రోజుల కిందనే ప్రజావాణి ప్రారంభించారు. బల్దియాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో మాత్రం ఇంకా షురూ చేయలేదు. ప్రజలు తమ సమస్యలపై ఆఫీసులకు వెళ్తే అధికారులు స్పందించట్లేదు. పక్క జిల్లాలైన మేడ్చల్, వికారాబాద్​ జిల్లాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని జనం ప్రశ్నిస్తున్నారు. అధికారులేమో కరోనా కారణంగానే నిర్వహించట్లేదని చెబుతుండగా జిల్లాల్లో లేని కరోనా సిటీలోనే ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి మళ్లీ స్టార్ట్​ చేస్తే సిటీజనాల సమస్యలు పైస్థాయి అధికారులకు చెప్పుకుంటామని అంటున్నారు. మేయర్ చొరవ తీసుకొని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.