- ప్రాణహితలో వరదతో కాఫర్ డ్యామ్ తొలగింపు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏడో బ్లాక్‌లో మరో సమస్య ఏర్పడిందన్న ప్రచారాన్ని అధికారులు కొట్టిపారేశారు. ఏడో బ్లాక్‌లో కొత్తగా ఏ సమస్య తలెత్తలేదని స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ అధికారులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద బుధవారం అర్ధరాత్రి కూడా పనులు చేశారు. వరద వస్తే పనులకు ఆటంకం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్‌ను తొలగించారు. దీంతో బ్యారేజీ ఏడో బ్లాక్ వద్ద గర్డర్లు కుంగాయన్న ప్రచారం జరిగింది. గ్రౌటింగ్ కూడా కొట్టుకుపోతున్నదనే కథనాలు వచ్చాయి.
అయితే, అలాంటిదేమీ లేదని ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు ఓ అండ్ఎం ఈఎన్సీ నాగేందర్ రావు స్పష్టం చేశారు. ప్రాణహిత నది నుంచి వరద పెరుగుతుండడంతోనే కాఫర్ డ్యామ్‌ను తొలగించామని, వరద ఎక్కువై కాఫర్ డ్యామ్ దగ్గర స్టోర్ అయిన నీళ్లను ఒకేసారి కిందకు వస్తే ప్రమాదమన్న ఉద్దేశంతోనే అర్ధరాత్రయినా సరే దానిని తొలగించామని వివరించారు.
పనులన్నీ పూర్తి..
మేడిగడ్డ వద్ద చేపట్టిన రిపేర్ వర్క్స్ దాదాపు పూర్తయిపోయాయని అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ ఎగువన కట్టిన కాఫర్ డ్యామ్‌తో పెద్దగా పనిలేదని, వరదలు కూడా పెరుగుతుండడంతో దానిని తీసేయాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన గ్రౌటింగ్ సహా అన్ని పనులు పూర్తయినట్టు చెబుతున్నారు. 20వ గేటును పూర్తిగా కట్ చేసి.. మిగతా గేట్లను పైకెత్తారు.
షీట్‌పైల్స్ రీప్లేస్మెంట్, కొత్త సీసీ బ్లాకుల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఎన్డీఎస్ఏ సూచించిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి కాలేదు. ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్న క్రమంలో బ్యారేజీల వద్ద సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ బోర్‌హోల్స్ తవ్వినా ఇన్వెస్టిగేషన్స్‌ను మధ్యలోనే అధికారులు ఆపేశారు. సమస్యను ఎన్డీఎస్ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు.