- విద్యుత్ కనెక్షన్లకు ఆధార్, రేషన్ కార్డు లింక్
- వివరాలు సేకరిస్తున్న విద్యుత్‌శాఖ సిబ్బంది
- 15లోగా ప్రాసెస్ పూర్తి చేసేందుకు ప్లాన్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం అమలుకు విద్యుత్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 200 యూనిట్లలోపు కరెంట్ ఉపయోగించే వారికి ఉచిత విద్యుత్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే వినియోగదారుల నుంచి దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. అందులో వచ్చిన అప్లికేషన్లను మళ్లీ క్షేత్ర స్థాయిలో ధ్రువీకరించుకునే పనిలో ఉన్నారు. ఈనెల 15లోగా వినియోగదారుల జాబితాను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
200 యూనిట్లలోపు 4.14 లక్షల కనెక్షన్లు!
జిల్లాలో మొత్తం 45 సబ్ స్టేషన్ల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. గత 12 నెలల కాలంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారి వివరాలను ఆఫీసర్లు ఇప్పటికే తెప్పించుకున్నారు. జిల్లాలో కేటగిరీ వన్ కింద 4,82,800 గృహ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వినియోగించేవి 4,14,807 ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
0 నుంచి 50 యూనిట్లలోపు వాడిన వారు 2,14,716 మంది, 51 నుంచి 100 యూనిట్లలోపు వాడిన వినియోగదారులు 1,26,973 మంది, 101 నుంచి 150 యూనిట్లలోపు 52,098 మంది, 151 నుంచి 200 యూనిట్లలోపు వాడిన వినియోగదారులు 21మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులను గుర్తించనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకే ఉచిత విద్యుత్ అమలు ఉంటుందని ఇప్పటికే చెప్పడంతో, వినియోగదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను ఆఫీసర్లు లింక్ చేస్తున్నారు.
రెండ్రోజుల నుంచి స్పాట్ బిల్లింగ్ సమయంలోనే వినియోగదారుల డేటా కలెక్ట్ చేస్తున్నారు. అంతకుముందే స్పాట్ బిల్లింగ్ పూర్తయిన 1,35,000 మంది వివరాలను ఈనెల 12 నుంచి 15 వరకు మరోసారి తిరిగి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వివరాలు సేకరించనున్నారు.
కిరాయిదారులకూ వర్తింపు
ఇండ్లలో కిరాయికి ఉంటున్న వారు కూడా విద్యుత్ మీటర్‌కు వారి రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్వివరాలు లింక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఇంటి ఓనర్ కు భవిష్యత్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, మీటర్యాజమాన్య హక్కులు పూర్తిగా ఇంటి ఓనర్ కే ఉంటాయని వివరిస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఇండ్లకు వచ్చిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే విద్యుత్ మీటర్ల దగ్గరే ఒక స్లిప్ పై ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు రాసి పెట్టి వెళ్లాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. తమ సిబ్బంది ఇండ్లకు వచ్చిన సమయంలో ఆ వివరాలను నమోదు చేసుకుంటారని వివరిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్నాం
ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ మీటర్ కు రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ లింక్ చేస్తున్నాం. గృహ విద్యుత్ కనెక్షన్లకు ఈనెల 15లోగా లింకేజీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే సిబ్బందికి దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. వినియోగదారుల నుంచి వచ్చే సందేహాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఎ.సురేందర్, ఎస్ఈ, ఖమ్మం