గాడి తప్పిన గార్బేజ్ ఫ్రీ సిటీ!

  • ఇంటింటి చెత్త తరలింపుపై అధికారుల చర్యల్లేవ్ 
  • కమిషనర్ ఆదేశించినా పట్టించుకోవట్లేదు
  • ఎక్కడ చూసినా రోడ్లపై పేరుకుపోతున్న చెత్త
  • జీవీపీల ఎత్తివేతపైనే బల్దియా ఫోకస్ 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో గార్బేజ్ వర్నలబుల్ పాయింట్స్(జీవీపీ) ఎత్తివేతపై దృష్టి పెట్టిన అధికారులు చెత్త తరలింపుపై మాత్రం పెట్టడంలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో చెత్త సమస్యగానే ఉంటోంది.  మెయిన్ రోడ్ల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త పేరుకుపోతోంది.  వానలు పడినప్పుడు కాలనీలు, బస్తీలు కంపుకొడుతున్న పరిస్థితి ఉంది. గార్బేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ చెత్త సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. జీవీపీలను ఎత్తివేసిన చోటనే ఇలా ఉంటోంది.  

సిటీలో మొత్తం 2,541 జీవీపీలను గుర్తించి చాలాచోట్ల ఎత్తివేశారు. ప్రస్తుతం కొన్నిచోట్ల లేవని బల్దియా ప్రకటించింది. ఇంటికి స్వచ్ఛ ఆటోలు రాని ప్రాంతాల్లోని వారు చెత్త ఎక్కడ వేయాలో తెలియక.. చేసేదేమి లేక రాత్రి పూట రోడ్లపైనే వేస్తుండగా తెల్లారేసరికి పేరుకుపోతుంది. చెత్తను వెంటనే తొలగించాలని స్థానికుల నుంచి బల్దియాకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

స్వచ్ఛ ఆటోలు సక్రమంగా వెళ్లకపోవడంతోనే.. 

సిటీలో సుమారు 4 వేల కాలనీలు ఉండగా, వెయ్యికిపైగా ఏరియాల్లో చెత్త సమస్య ఉంది. ఇంటింటికీ వెళ్లే స్వచ్ఛ ఆటోలు 4,500 ఉండగా.. ఇందులో వెయ్యి వరకు ఫీల్డ్ లోకే వెళ్లడంలేదు. కొన్ని రిపేర్లకు వచ్చాయి. ఇంకొన్ని మిగతా చోట్ల చెత్తను సేకరిస్తున్నాయి. ఆటోలు వచ్చినా కూడా లిమిటెడ్ గా మాత్రమే చెత్తను తీసుకెళ్తామని కండిషన్స్ పెడుతున్నాయి.  

ఇలా 25 శాతం వరకు ఆటోల ద్వారా చెత్త సేకరణ జరగడంలేదు.  కోటిన్నర జనాభా ఉన్న సిటీలో 4,500 ఆటోలు సరిపోవడం లేదు. మరోవైపు స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతోనే  రోడ్లపై చెత్త వేస్తున్నామని కొన్ని కాలనీల వాసులు చెబుతున్నారు. రెగ్యులర్ గా వస్తే ఆటోలోనే వేస్తామని అంటున్నారు.  నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకనే చెత్త సమస్య వస్తుంది. ఆటోల సంఖ్య పెంచడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటే తప్ప రోడ్లపై చెత్త   సమస్య తొలగేలా లేదు. 

చెత్త ఎక్కడ వేయాలో తెలియక.. 

కాలనీల జనానికి చెత్త ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.  స్వచ్ఛ ఆటోలు టైమ్ కి వెళ్లడంలేదు.  కొన్ని ప్రాంతాల్లో మూడురోజులకోసారి వెళ్తున్నాయి. అప్పటి వరకు ఇంట్లోని చెత్తను బయట డస్ట్​ బిన్​లోనైనా వేద్దామనుకుంటే వాటిని మూడేండ్ల కిందటే తొలగించారు. దీంతో ఎక్కడ వేయాలో తెలియక రోడ్లపైనే పారబోసి వెళ్తున్నారు. డస్ట్​ బిన్లు లేక చెత్తను కుక్కలు, పశువులు చిందర వందర చేస్తున్నాయి.

డస్ట్​ బిన్​ లెస్​ సిటీగా మార్చే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెత్త డబ్బాలను తొలగించారు. ఇంటి నుంచి చెత్తను ఆటోల్లో ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు, అటునుంచి డంపింగ్​యార్డుకు తరలించాలని నిర్ణయించారు.  దీంతో రోడ్లపై చెత్త ఉండొద్దనుకున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై చెత్త సమస్య   ఎక్కువవుతోంది. 

డస్ట్ బిన్ లెస్​గా మార్చేందుకు..

 డస్ట్ బిన్ లెస్ సిటీ అంటూ గతంలో చెత్త కుండీలను తొలగించారు. ఇప్పుడు జీవీపీ ఫ్రీ సిటీగా మార్చాలని జీహెచ్ఎంసీ అనుకుంటుంది. ఇందుకు అన్ని సర్కిళ్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల ఆదేశించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ మాదిరిగా అన్నిచోట్ల జీవీపీలను ఎత్తివేయాలని ఆదేశించారు. మొత్తంగా జీవీపీ ఫ్రీ సిటీగా మార్చాలని పేర్కొన్నారు.  

అయితే.. కొన్ని చర్యలు తీసుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా? లేదా అనేదానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేసినప్పుడే జీవీపీ ఫ్రీ సిటీ సాధ్యమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.  లేదంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.