
- సివిల్సప్లై గోడౌన్లలో గోల్మాల్
మెదక్, వెలుగు : జిల్లాలోని సివిల్సప్లై గోడౌన్లలో తవ్విన కొద్దీ అక్రమలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల కింద మెదక్, రామాయంపేట, చేగుంట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో సుమారు రూ.16 కోట్ల విలువైన కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్), సన్నబియ్యం మాయమయ్యాయి. ఇపుడు అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.5.68 కోట్ల విలువైన గన్నీ బ్యాగులు గాయబ్ అయినట్టు గుర్తించారు.
వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్యాడీ ప్రొక్యూర్ మెంట్సెంటర్ (పీపీఎస్)లకు, బియ్యం నిల్వచేసేందుకు రైస్‌మిల్లర్లకు సివిల్సప్లై డిపార్ట్మెంట్గన్నీబ్యాగులు కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా సీజన్లలో 300 నుంచి 400 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
రైస్ మిల్లులు160 ఉన్నాయి. జిల్లాకు అవసరమైన గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి మెదక్, రామాయంపేట, చేగుంటలోని గోడౌన్లలో స్టాక్చేసి అవసరాలను బట్టి ఆయా కొనుగోలు కేంద్రాలకు, రైస్ మిల్లులకు సప్లై చేస్తారు. ఈ గోడౌన్లకు వచ్చే గన్నీ బ్యాగ్‌లను 50 చొప్పున కట్టలు కట్టి ఒక క్రమ పద్దతిలో అమర్చాలి. వాటికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్మెయింటెన్ చేయాలి. ఏ కొనుగోలు కేంద్రానికి, ఏ రైస్ మిల్లుకు ఎన్ని బ్యాగులు ఇచ్చింది, ఇంకా ఎన్ని బ్యాగులు నిల్వ ఉన్నాయనేది ఎప్పటికపుడు రికార్డులో నమోదు చేయాలి.
సివిల్సప్లై డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు గోడౌన్లను తనిఖీ చేసి బియ్యంతోపాటు, గన్నీబ్యాగుల రికార్డులను తనిఖీ చేసి సక్రమంగా ఉన్నాయా? లేదా ? అన్నది పరిశీలించాలి. అయితే అధికారులు ఇవేమి పట్టించుకోకపోవడంతో గోడౌన్ ఇన్‌చార్జిలది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అడిగేవారు లేరనే ధీమాతో లక్షల గన్నీ బ్యాగులను పక్కదారి పట్టించారు.
అక్రమాలు ఇలా..
గడచిన ఏడాదిన్నర కాలంలోనే జిల్లాలో రూ.5.68 కోట్ల విలువైన 14.15 లక్షల గన్నీబ్యాగులు పక్కదారి పట్టాయి. మెదక్ పట్టణంలోని గోడౌన్లో రూ.2.08 లక్షల విలువైన పాత గన్నీబ్యాగులు 8.05 లక్షలు, రూ.2.49 కోట్ల విలువైన 3.28 లక్షల కొత్త గన్నీ బ్యాగులు మాయమయ్యాయి. రామాయంపేట గోడౌన్లో రూ.52.52 లక్షల విలువైన పాత గన్నీ బ్యాగులు 2 లక్షలు, రూ.66.68 లక్షల విలువైన 87,830 కొత్త గన్నీ బ్యాగులు మాయమయ్యాయి. చేగుంటలోని గొడౌన్లో కూడా గన్నీ బ్యాగులు మాయమైనట్టు తెలియడంతో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఆర్ఆర్యాక్ట్ కింద రికవరీ
మెదక్, రామాయంపేట గోడౌన్లలో పెద్ద మొత్తంలో గన్నీబ్యాగులు పక్కదారి పట్టినట్టు తనిఖీల్లో గుర్తించాం. గోడౌన్ ఇన్‌చార్జిలు గన్నీబ్యాగుల స్టాక్, రిజిస్టర్ల మెయింటనెన్స్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మెదక్, రామాయంపేట గోడౌన్లలో పీడీఎస్రైస్అక్రమాలకు పాల్పడిన ఆయా గోడౌన్ ఇన్‌చార్జిలు నర్సింలు, సతీశ్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారి మీద ఆర్ఆర్యాక్ట్ ప్రయోగించి పక్కదారి పట్టిన బియ్యం తాలూకూ మొత్తాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే దుర్వినియోగం అయిన గన్నీబ్యాగులకు సంబంధించిన అమౌంట్ కూడా ఆర్ఆర్యాక్ట్ కింద వారి నుంచి రికవరీ చేస్తాం.
హరికృష్ణ, సివిల్సప్లై డీఎం