
- ఫుడ్, శానిటేషన్, ఇతర వసతుల పరిశీలన
- అధికారుల రిపోర్టు ఆధారంగా వార్డెన్లపై చర్యలు
- గతేడాది 45 మంది వార్డెన్లకు షోకాజ్ లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని సంక్షేమ హాస్టళ్లలో అధికారుల మళ్లీ తనిఖీలు షురూ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆశ్రమ, ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో వసతులు, శానిటేషన్, ఫుడ్ మెనూ, ఇతర సమస్యలు తెలుసుకుంటున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరోసారి హాస్టళ్ల తనిఖీకి ఆదేశించారు. జిల్లాలో164 హాస్టళ్లకు గతంలో మాదిరిగానే 82 మంది స్పెషల్ ఆఫీసర్లను హైదరాబాద్ కలెక్టర్ నియమించారు. ప్రతి అధికారి నిర్ణీత సమయం హాస్టల్లో ఉండాలని, పిల్లలకు పెడుతున్న భోజన వివరాలు తెలుసుకోవాలని, వారితో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు.
ఒక్కో అధికారి రెండు హాస్టళ్ల చొప్పున తనిఖీ చేసి, ఫొటోలతో కూడిన రిపోర్టు కలెక్టర్ కు ఇవ్వనున్నారు. ఆదివారమే కొందరు అధికారులు హాస్టళ్ల తనిఖీ మొదలుపెట్టగా, సోమవారం నుంచి మిగతా వారు తనిఖీలకు వెళ్లనున్నారు. కాగా, గత నవంబర్ లో అధికారులు హాస్టళ్ల తనిఖీ చేశారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా? లేదా? హాస్టల్పరిసరాలు క్లీన్గా ఉంటున్నాయా? లేదా? స్టాఫ్ అటెండెన్స్, రిజిస్టర్ అప్డేట్ గా ఉంటున్నాయా లేదా? అనే వివరాలు తెలుసుకొని కలెక్టర్ కు రిపోర్టు అందజేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా 45 మంది వార్డెన్లకు కలెక్టర్షోకాజ్ నోటీసులిచ్చారు.