నిధులిచ్చి.. ఆదుకోండి

  •     కేంద్రానికి లేఖ రాసిన జీహెచ్ఎంసీ  
  •     రూ.500 కోట్లు ఇవ్వాలని కోరిన అధికారులు
  •     ఫండ్స్ లేక విపత్తు నివారణ చర్యలకు ఇబ్బందులు 
  •     వరదలు వచ్చినప్పుడు ముంపు లేకుండా నాలాల అభివృద్ధి
  •     ఫైర్ సేఫ్టీ మెషీన్ల కొనుగోలు వంటి వాటికి ఫండ్స్ కోరిన బల్దియా

హైదరాబాద్, వెలుగు : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేక ఎదురుచూస్తోంది. ఆదుకోవాలని కేంద్ర విపత్తు నివారణ శాఖకు నెలరోజుల కిందట లేఖ రాసింది. విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పనులు చేపట్టాలని, అందుకు రూ.500 కోట్ల నిధులు ఇవ్వాలని కోరింది. గ్రేటర్ సిటీలో భారీ వర్షాలు పడ్డప్పుడు వరదలు ముంచెత్తుతాయి. మరోవైపు వరుసగా అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి. వీటి నివారణలో  వినియోగించేందుకు అత్యాధునిక యంత్రాలు లేకపోవడంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు పడుతుంది.  

నిధులు ఇస్తే.. వరదల నివారణలో భాగంగా నాలాల అభివృద్ధి, అగ్నిమాపక యంత్రాల కొనుగోలు చేస్తామని అధికారులు ఆ లేఖలో కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా అధికారులకు ఫ్రీడమ్ దొరికింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇలా నిధులు అడగాలంటే కూడా కేసీఆర్, కేటీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవు. సిటీ డెవలప్ మెంట్, ప్రజా సౌకర్యాలు చేపట్టేందుకు అధికారులే నేరుగా నిధులు కోరవచ్చు. ఇందుకు కేంద్రం నుంచి విపత్తుల నివారణకు నిధులు కావాలంటూ బల్దియా అధికారులు కోరినదే కారణంగా చెప్పొచ్చు. 

నిధులు వస్తే ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ పనులు..

గ్రేటర్ సిటీలో వరదల నివారణకు స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ డీపీ) ఫేజ్ –1 కింద రూ. 737.45 కోట్లతో 37 నాలాల పనులు చేపట్టారు. ఇందులో ఇంకా 6  చోట్ల పనులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంచితే.. రెండున్నరేండ్ల కిందట ఫేజ్ –1 పనులు మొదలుపెట్టిన వెంటనే రూ.1000  కోట్లతో దాదాపు70 నాలాల పనులు చేపట్టాలని ఫేజ్ –2 కు ప్రపోజల్స్​కూడా అధికారులు ప్రభుత్వానికి పంపారు. అయితే.. సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమతులు ఇస్తామని చెప్పినా.. ఎన్నికల చివరి వరకు కూడా కేటాయించలేదు.

అయితే నాలాల నిర్మాణం,  విపత్తుల నివారణ కోసం నిర్మిస్తుండడంతో వీటికోసం కేంద్రం నుంచి విపత్తుల నివారణకు నిధులు కోరారు. వాటితో నాలాల నిర్మాణం చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నిధులు వస్తే వాటిలో కొన్ని నాలాల నిర్మాణానికి కేటాయిస్తారు. ఇలా మొత్తానికి కేంద్రం నుంచి విపత్తుల నివారణ కు నిధులను రాబట్టేందుకు జీహెచ్ఎంసీ అన్నివిధాల ప్రయత్నాలు చేస్తుంది.    

కోటిన్నర జనాభాకు సరిపడాలేని టీమ్స్​ 

సిటీలో ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ లో డిజాస్టర్ రెస్పాన్స్​ఫోర్స్(డీఆర్​ఎఫ్) టీమ్స్  ఏర్పాటు చేశారు .కోటిన్నర జనాభా కలిగిన సిటీలో కేవలం  30  డీఆర్ఎఫ్​టీమ్స్ మాత్రమే ఉండగా..  భారీ వానలు పడ్డప్పుడు సత్వర సహాయక చర్యలు అందించడం కష్టంగా మారింది. ముందుగా వచ్చిన ఫిర్యాదుల ప్రాంతాలకే టీమ్స్​వెళ్తున్నాయి. అక్కడ క్లియర్​చేశాక మిగతా ప్రాంతాలకు తరలిస్తున్నారు.  అప్పటివరకు ఆపదలో ఉన్నవారు రెస్క్యూ టీమ్స్ వస్తాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మూడేండ్ల కిందట భారీ వరదలు వచ్చినప్పుడు వందలాది కాలనీలు నీట మునిగాయి.

సరైన సహాయక చర్యలు అందక ఎంతో మంది ఎవరికివారు సాయం చేసుకునే పరిస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్లకు ఎన్​డీఆర్ఎఫ్ టీమ్స్​వెళ్లాయి. అదే టీమ్స్​సరిపడా ఉంటే తక్షణ చర్యలు అందేవి. తక్కువలో తక్కువ సిటీ జనాభాకు కనీసం 100 డీఆర్ఎఫ్​ టీమ్స్​అవసరమని అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, 300 డిజాస్టర్​టీమ్స్​ఏర్పాటు చేయాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.  ప్రస్తుతం డీఆర్ఎఫ్ వద్ద  కేవలం 8 బోట్లు మాత్రమే ఉన్నాయి.  ఒక్కో టీమ్ లో 46 రకాల పనిముట్లు ఉండగా.. ట్రీ కటింగ్ మెషీన్, పంపు మోటార్లు, జనరేటర్, డ్రిల్ కట్టర్, డ్రాగెన్ లైట్స్ తదితర సామగ్రి    ప్రతి టీమ్ వద్ద అందుబాటులో ఉంటుంది.  

అగ్ని ప్రమాదాలు అయిన వెంటనే.. 

గతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ అధికారులే సహాయక చర్యలు చేపట్టేవారు. పెద్ద ప్రమాదాలు అయితేనే వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చేవారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన డీఆర్ఎఫ్ టీమ్స్​చాలా యాక్టీవ్ గా ఉన్నాయి.  ప్రమాదాలపై సమాచారం అందిన నిమిషాల్లోనే వెళ్లి మంటలను అదుపులోకి తెస్తున్నాయి. బాధితులు చిక్కుకుంటే వెంటనే రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తున్నాయి.  ఇదంతా ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చేలోపే రెస్క్యూ ఆపరేషన్ మొదలవుతుంది. ఇలా గత మూడేండ్లుగా జరిగిన భారీ అగ్నిప్రమాదాల్లో డీఆర్ఎస్​టీమ్స్​ఎంతో కీలకంగా పనిచేశాయి.

బోయగూడ గోదాం, సికింద్రాబాద్ రూబీ లాడ్జీ, దక్కన్ మాల్ వంటి భారీ అగ్నిప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు డీఆర్ఎఫ్​టీమ్స్​చాలా వరకు శ్రమించాయి. ఇంత ప్రధాన్యం కలిగిన డీఆర్ఎఫ్ ను  సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 30 టీమ్ ల్లో  450 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా ముందుగా వెళ్లి వీరే కంట్రోల్ చేస్తుంటారు.  కేంద్రం కోరిన నిధులు కేటాయిస్తే బల్దియాలో  టీమ్స్ కూడా పెంచితే.. సమస్యలు తగ్గవచ్చని చెప్పొచ్చు.