- ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం
- ముందు మిర్యాలగూడ, చివరకు దేవరకొండతో ఓట్ల లెక్కింపు కంప్లీట్
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ప్రధానంగా భువనగిరి ఎంపీ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నల్గొండ ఎంపీ సెగ్మెంట్స్థానం మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక భువనగిరిలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ, ఇక్కడ బీసీ సెంటిమెంట్ పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నల్గొండ, భువనగిరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ముందుగా పోస్టల్బ్యాలెట్ఓట్లను లెక్కిస్తారు. తదనంతం ఈవీఎంలు ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ మేరకు రెండు జిల్లాల్లో ఎన్నికల రిటర్నింగ్అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండలో ముందుగా మిర్యాలగూడ అసెంబ్లీ, చివరలో దేవరకొండ అసెంబ్లీలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం..
పట్టణ సమీపంలోని దుప్పలపల్లి వేర్‌హౌజింగ్‌గోదాముల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. గత నెల13న పోలింగ్‌తర్వాత అక్కడే స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపర్చి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆధర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్‌బ్యాలెట్ ఓట్లను 24 టేబుళ్లపై లెక్కిస్తారు. పది నిమిషాల తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వీటిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ ఉన్నాయి.
9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం..
మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మొదటి రౌండ్ కాబట్టి గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్కో రౌండ్అరగంటలో పూర్తయ్యే అకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఉన్న పోలింగ్‌స్టేషన్లను బట్టి ప్రతి రౌండులోని 14 పోలింగ్‌స్టేషన్లలోని ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అతి తక్కువగా ఉన్న పోలింగ్‌స్టేషన్లు (264) ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో మొదట పూర్తికానుండగా, అత్యధికంగా పోలింగ్‌స్టేషన్లు ఉన్న దేవరకొండ నియోజకవర్గం (324) ఓట్ల లెక్కింపు 24 రౌండ్లలో చివరకు పూర్తి కానుంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దేవరకొండ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా రౌండ్ల వారీగా లెక్కింపు పూర్తి కాగానే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొదటి రౌండు పూర్తి కాగానే ఫలితాన్ని మీడియాకు వెల్లడిస్తారు. అదే విధంగా అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతున్నందున నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌నాయకుడెవరనేది మధ్యాహ్నానానికి తేలనుంది.