
- ఉమ్మడి జిల్లాలో 29,069 మంది విద్యార్థులు
- 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అంతా సిద్ధం చేశారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29,069 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకు 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రశ్రాపత్రాలు లీక్‌కు అవకాశం లేకుండా..
సీసీ కెమెరాల నిఘా మధ్య, ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగానే పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను నిషేధించారు. కొశ్చన్ పేపర్ పై క్యూఆర్ కోడ్ ముద్రించడంతో పాటు విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. ఆ బుక్ లెట్ లోని అన్ని పేజీలపై ఒక యూనిక్ నెంబర్ ను ప్రింట్ చేస్తారు. దీని వల్ల ఆన్సర్ షీట్ లోని పేజీలను వేరుగా మార్చి మోసాలకు, తప్పులకు పాల్పడే అవకాశం ఉండదు. ఇన్విజిలేటర్ ను పదే పదే ఎక్స్ ట్రా ఆన్సర్ షీట్ అడిగే అవసరం లేకుండా ఒకేసారి బుక్ లెట్ ఇవ్వడం ద్వారా విద్యార్థులకు కొంత సమయం ఆదాకానుంది.
5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే..
ఎగ్జామ్ రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖకు సంబంధం లేని అధికారులను సిట్టింగ్ స్క్వాడ్ లుగా నియమించారు. ఎగ్జామ్ కు గంట ముందు నుంచే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభమైన 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
సెంటర్ల వద్ద సెక్షన్163 అమలు
పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఏర్పాట్లపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియాతో మాట్లాడారు. ఆయా పరీక్షా కేంద్రాల దగ్గర మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షాకేంద్రాల నుంచి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
ట్రాఫిక్ జామ్ కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. టెన్త్ ఎగ్జామ్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భద్రాద్రికొత్తగూడెం డీఈఓ వెంకటేశ్వరాచారి, ప్రభుత్వం పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు తెలిపారు. ఎగ్జామ్స్ ప్రారంభానికి ముందే ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు
విజ్ఞప్తి చేశామన్నారు.
ఎక్కడెక్కడ ఎంత మంది..
ఖమ్మం జిల్లాలో 97 కేంద్రాల్లో 16,788 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 73 సెంటర్లలో 12,281 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 871 మంది ఇన్విజిలేటర్లు ఎగ్జామ్స్ డ్యూటీల్లో భాగస్వామ్యం కానున్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 11 సీ(సెల్ఫ్సెంటర్లు) సెంటర్లున్నాయి. సీ సెంటర్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.