రుణమాఫీ అనుమానాల నివృత్తికి  కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు

రుణమాఫీ అనుమానాల నివృత్తికి  కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు
  • మాఫీ అయినట్లు మెసేజ్​లురాని రైతుల్లో ఆందోళన 
  • బ్యాంకులు, సొసైటీల  వద్ద బారులు
  • గైడ్​లైన్స్​పై అవగాహన లేకే అంటున్న అధికారులు
  • మండలాలు, జిల్లా కేంద్రాల్లోనూ గ్రీవెన్స్​ సెల్​ల ఏర్పాటు 
  • రైతు వేదికల్లో అందుబాటులో లబ్ధిదారుల జాబితాలు

ఖమ్మం/నల్గొండ,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన నేపథ్యంలో  వివిధ కారణాల వల్ల రుణ మాఫీ జరగని రైతుల సందేహాలను తీర్చడంపై అధికారులు దృష్టి పెట్టారు. వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులు సొసైటీ ఆఫీసులు, బ్యాంకులకు పరుగులు తీస్తుండడంతో వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. సర్కారు ఆదేశాలతో శుక్రవారం కలెక్టరేట్లతో పాటు మండల స్థాయిలోనూ సహాయ కేంద్రాలను  ఓపెన్ ​చేశారు.

ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో  అనుమానాల నివృత్తికి  9063211298కు ఫోన్​ చేయాలని అక్కడి కలెక్టర్​ సూచించగా, నల్గొండ జిల్లాలో  7288800 023కు కాల్​ చేయొచ్చని అక్కడి కలెక్టర్​నారాయణ రెడ్డి ప్రకటించారు. కలెక్టరేట్లలో సహాయ కేంద్రం వర్కింగ్ డేస్​లో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రుణమాఫీ జరిగిన రైతుల జాబితాను రైతు వేదికల దగ్గర అందుబాటులో ఉంచారు. రుణమాఫీ కాని వాళ్లు అక్కడ వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా కారణాలను అడిగి తెలుసుకోవచ్చని చెప్తున్నారు. 

ముందుగా బ్యాంకు ఆఫీసర్లను సంప్రదించాలి..

రుణ మాఫీ జరిగినట్లు మెసేజ్​రాకుంటే రైతులు ముందుగా వారి బ్యాంకు ఖాతా ఉన్న  బ్రాంచికి వెళ్లి తెలుసుకోవాలి.  ఒకవేళ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే మండల వ్యవసాయ విస్తరణ అధికారికి ఫిర్యాదు చేయాలి. గ్రామ, మండల వ్యవసాయ విస్తరణాధికారులకు వచ్చిన ఫిర్యాదులను జిల్లా గ్రీవెన్స్​కు పంపిస్తే, జిల్లా లీడ్​ బ్యాంకు మేనేజర్ ద్వారా సమీక్షించి పరిష్కస్తామని కలెక్టర్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో పరిష్కారమయ్యేవైతే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్తున్నారు.  అన్ని మండల కేంద్రాల్లో వ్యవసాయ విస్తరణ ఆఫీసర్లతో గ్రీవెన్స్  సెల్ లు ఏర్పాటు చేయడమేగాక,  వ్యవసాయశాఖ ఆఫీసులో గ్రీవెన్స్​ సెల్స్​ ఏర్పాటు చేశారు.

గైడ్​లైన్స్​పై అవగాహన లేకే అయోమయం.. 

 లక్షలోపు పంట రుణాలున్న పలువురు రైతుల ఖాతాల్లో గురువారం డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్​పై అవగాహన లేకపోవడమే కారణమని ఆఫీసర్లు చెప్తున్నారు. బ్యాంక్​ అకౌంట్ కు ఆధార్​ కార్డు లింక్​ కాకపోవడం, వేరొకరి ఆధార్​ నెంబర్​ లింక్​ కావడం, బ్యాంక్​ అకౌంట్, ఆధార్​ మిస్​ మ్యాచ్​ కావడం వంటి కారణాల వల్ల పలువురికి రుణమాఫీ కాలేదు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా, రేషన్​ కార్డు లేని వారికి సైతం మాఫీ జరగలేదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెండో విడతలో ఇలాంటివాళ్లకు మాఫీ ఉంటుందని చెబుతున్నారు.

ఒకే కుటుంబంలో ఎక్కువ మంది లక్ష లోపు లోన్లు తీసుకున్నప్పటికీ ఫ్యామిలీ యూనిట్​గా తీసుకున్నప్పుడు రూ.2లక్షలు దాటుతుందని, అలాంటివారికి  రెండు, మూడో విడతల్లో రుణమాఫీ జరుగుతుందంటున్నారు. కుటుంబంలో మహిళ పేరిట లోన్​ తీసుకుంటే మొదట వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇతరులకు మాఫీ ఆగిందని, ఇవన్నీ త్వరలో క్లియర్​ అవుతాయని అంటున్నారు.