నల్గొండ జిల్లాలో ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్

నల్గొండ జిల్లాలో ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్
  • వంద శాతం ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యం
  • పన్ను వసూళ్లు చేయకపోతే పనిష్మెంట్​
  • జిల్లా ఇప్పటివరకు 36,09 శాతం మాత్రమే వసూళ్లు 
  • మార్చి 31తో ముగియనున్న గడువు 
  • వసూళ్లలో వెనుకబడిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్

నల్గొండ, వెలుగు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. 100 శాతం పన్ను వసూళ్లే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో 36.09 శాతం మాత్రమే వసూలైంది. ఏ గ్రామ పంచాయతీ సైతం లక్ష్యానికి చేరువలో లేదు. మరో వైపు మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మల్టీ పర్పస్‌‌‌‌ ఉద్యోగులకు నెలవారీ వేతనాల చెల్లింపు ఇబ్బందికరంగా మారింది.

 ఈ క్రమంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అత్యవసర పనులకు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు వివిధ సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు 30 శాతం కూడా పన్ను వసూళ్లు చేయని 12 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

పన్ను వసూళ్లలో వెనుకబడిన నల్గొండ జిల్లా..

జిల్లాలోని 31  మండలాల్లోని 844 గ్రామ పంచాయతీల్లో గతేడాది ఏప్రిల్‌‌‌‌1 నుంచి నేటివరకు కేవలం 36,09 శాతం మాత్రమే పన్ను వసూలైంది. జిల్లావ్యాప్తంగా రూ.15,58,79,112  పన్ను వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.3,26,84,659  వసూళ్లు చేశారు. జిల్లాలో అత్యధికంగా నల్గొండ  మండలంలో 68 శాతం పన్ను వసూళ్లు కాగా, అత్యల్పంగా నార్కెట్ పల్లి మండలంలో 9 శాతం వసూలైంది. మరో మూడు మండలాల్లో 20 శాతం పన్ను కూడా వసూళ్లు చేయకపోగా, మరో మూడు మండలాల్లో 30 శాతం లోపే మాత్రమే వసూళ్లు చేశారు. మొత్తం 31 మండలాల్లో 27 మండలాలు కనీసం 50 శాతం పన్నులు కూడా వసూళ్లు చేయకపోవడం 
గమనార్హం. 

వసూళ్లపై ఫోకస్ పెట్టిన అధికారులు..

గ్రామ పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనకబడడంతో అధికారులు ఫోకస్ పెట్టారు. దాదాపు 27 మండలాల్లో 50 శాతం కంటే తక్కువ పన్ను వసూళ్లు చేయగా, 30 శాతం కంటే తక్కువ పన్నులు వసూళ్లు చేసిన పంచాయతీ కార్యదర్శులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలోని నకిరేకల్, కొండమల్లేపల్లి, కట్టంగూర్, దేవరకొండ, గుర్రంబొడు, నేరేడుగొమ్ము, శాలిగౌరారం, నార్కట్ పల్లి, చండూరు, కేతేపల్లి, చందంపేట, అనుముల మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మార్చి 31 వరకు 100 శాతం పన్ను వసూళ్లు చేయాలని పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. 

వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం 

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం వన్ను వసూళ్లే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పన్నుల వసూళ్లపై డీఎల్‌‌‌‌పీవోలు, ఎంపీవోల ద్వారా కార్యదర్శులకు తగిన సూచనలు చేశాం. మార్చి 31 వరకు వంద శాతం ట్యాక్స్‌‌‌‌ వసూళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పన్ను వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 

కె.వెంకయ్య, డీపీవో, నల్గొండ జిల్లా