నీటి ఎద్దడి నివారణకు చర్యలు షురూ!

  • ముదురుతున్న ఎండలు.. పడిపోతున్న భూగర్భ జలాలు
  • ఫిబ్రవరిలోనే 7.97  మీటర్లకు పడిపోయిన నీటి మట్టం 
  • వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆఫీసర్ల నిర్ణయం
  • ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు ప్రణాళికలు 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత బోర్లు, చేతి పంపులకు రిపేర్లు 

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి నివారణపై అధికారులు దృష్టి పెట్టారు. ఎండాకాలం ప్రారంభంలోనే తాగునీటికి తిప్పలు ఎదురవుతుండడంతో వాల్టా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అనుమతి లేకుండా ప్రైవేటు బోర్లు వేస్తే వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిసైడయ్యారు. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయాలపై ఆఫీసర్లు నజర్​ పెట్టారు. రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటుతుండడంతో కొద్దిరోజుల్లోనే మిషన్​ భగీరథ నీళ్లకు బ్రేక్​ పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాత బోర్లు, చేతి పంపులను మళ్లీ వాడుకలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రన్నింగ్ కండిషన్​ లో లేని వాటిని గుర్తించి రిపేర్లు చేస్తున్నారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి? 
    
ఖమ్మం జిల్లాలో మిషన్​ భగీరథ ద్వారా 589 గ్రామ పంచాయతీల్లోని 969 ఆవాస ప్రాంతాల్లో, 2.92 లక్షల ఇండ్లకు తాగునీటిని అందిస్తున్నారు. 588 కొత్త ఓవర్​ హెడ్​ ట్యాంకులతో కలిపి మొత్తం 1,487 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జిల్లాలో పట్టణ ప్రాంత పరిధిలో 804 బోర్లు, 151 చేతి పంపులు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంత పరిధిలో 1,627 బోర్లు, 7,199 చేతి పంపులను పూర్తి స్థాయిలో చెక్​ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. రీసెంట్ గా జిల్లాలో తాగునీటి సరఫరాపై ఆయా శాఖల అధికారులతో ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్ సమీక్షించారు.

ఎంపీడీవోలు, పంచాయితీరాజ్, ఆర్​డబ్ల్యూఎస్​ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ క్రమంలో జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. బోర్ల రిపేర్లు , ఫ్లషింగ్ లు, ప్రైవేటు బావులు, నీటి వనరులు లీజుకు తీసుకునేందుకు చూస్తున్నారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్ర స్థాయిలో గ్రామాలు తిరిగి తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు. 
    
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,034  హ్యాండ్​ పంపులు ఉండగా, ఇందులో 1,148 రిపేర్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,026 హ్యాండ్ పంప్స్ రిపేర్ చేశారు. మిగతా వాటికి రిపేర్లు చేస్తున్నారు. జిల్లాలో మోటార్లతో కూడిన బోర్లు 1,590 ఉన్నాయి. ఇందులో 268 బోర్లు రిపేర్ చేయాల్సి ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటి వరకు 236 బోర్లకు రిపేర్ చేశారు. మిగతా వాటికి రిపేర్లు చేస్తున్నారు. 

లోలోతుకు భూగర్భ జలాలు.. 

ఖమ్మం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 5.11 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈసారి 6.22 మీటర్లకు పడిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం 0.76 మీటర్లకు పడిపోయాయి.  మరోవైపు  కాల్వలు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు మరింత పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది ఫిబ్రవరిలో 6.91 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండగా, ఈఏడాది ఫిబ్రవరికి 7.97 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ముదిగొండ, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వేసవిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.