మెదక్​ జిల్లాలో రుణమాఫీతో రైతుల్లో సంబురం

మెదక్​ జిల్లాలో రుణమాఫీతో రైతుల్లో సంబురం
  • రెండో విడతలో భాగంగా మెదక్​లో రూ. 202.98 కోట్లు
  • సిద్దిపేటలో రూ.279.33 కోట్లు
  • సంగారెడ్డిలో  రూ.రూ.286.76 కోట్లు విడుదల

మెదక్​టౌన్, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో అన్నదాతలు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్​ కలెక్టర్​రాహుల్​రాజ్​ మాట్లాడుతూ.. మొదటి విడతలో జిల్లాలోని 47,968 మంది రైతులకు రూ. 238.81 కోట్లు, రెండో విడతలో 21,517 మంది రైతులకు రూ. 202.98 కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 69,495 మంది రైతులకు రూ. 441.79 కోట్ల నిధులు జమ అయ్యాయని పేర్కొన్నారు.  

అలాగే రూ.2 లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు త్వరలోనే నిధులు విడుదలవుతాయన్నారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సందేహాలు,  ఫిర్యాదులున్నా వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​వెంకటేశ్వర్లు, డీఏవో గోవింద్, డీసీవో కరుణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మూర్తి , జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయ శాఖ, బ్యాంకుల అధికారులు, రైతులు 
పాల్గొన్నారు. 

సిద్దిపేటలో..

సిద్దిపేట:రుణమాఫీ విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు, రైతులతో కలిసి రుణామాఫీ కార్యక్రమాన్ని వీక్షించి మాట్లాడారు.  జిల్లాలో లక్షన్నర లోపు రుణాలున్న  27,955 మంది రైతులకు రూ.279.33 కోట్లు మాఫీ అవుతాయన్నారు.  రైతులు  బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా  రుణమాఫీ నిధులను తీసుకోవచ్చని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరిగేలా  బ్యాంకర్లకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.

రైతుల  సమస్యలను పరిష్కరించాడానికి  క్లస్టర్  స్థాయి నుంచి  ఏఈవో, ఏవో, అసిస్టెంట్ డైరెక్టర్లు,  జిల్లా వ్యవసాయ అధికారి అందుబాటులో ఉంటారని  వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతు రుణ మాఫీ చెక్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

 సంగారెడ్డిలో..

సంగారెడ్డి టౌన్: రుణమాఫీ రెండో విడత కార్యక్రమం మంగళవారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న రుణమాఫీ కార్యక్రమాన్ని కలెక్టర్​క్రాంతి, వ్యవసాయ, బ్యాంకు అధికారులు, రైతులు వీడియో కాన్ఫరెన్స్​లో వీక్షించారు. అనంతరం కలెక్టర్​క్రాంతి మాట్లాడుతూ.. జిల్లాలో రూ.లక్ష నుంచి రూ. లక్షా యాభై వేల లోపు రుణాలున్న 27, 249 మంది రైతులకు ప్రభుత్వం రూ.286.76 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

రుణమాఫీతో రైతులు తక్కువ వడ్డీకే కొత్త రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపాలను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొంది, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులో పొరపాట్ల కారణంగా రుణమాఫీ జాబితాలో పేరు రాని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రైతులు రుణమాఫీకి సంబంధించి 08455 276456 నెంబర్ కు ఫోన్ వివరాలు  తెలుసుకోవచ్చన్నారు.