- మిల్లుల్లో వడ్ల నిల్వలను తనిఖీ చేస్తున్న సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ఆఫీసర్లు
నాగర్ కర్నూల్, వెలుగు: ఎట్టకేలకు ఎఫ్‌సీఐ ఒత్తిడితో సీఎంఆర్ బకాయిల లెక్కలు తేల్చారు. 2020–-21 నుంచి 2023–-24 వరకు దాదాపు 42,828 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కు సంబంధించి రూ.147.23 కోట్ల బకాయి ఉన్నట్లు గుర్తించారు. సప్లై చేసిన వడ్లకు సంబంధించి సీఎంఆర్ బకాయిలు పెరుగుతుండడంతో ఈ నెల 30 వరకు అధికారులు గడువు విధించారు. పెనాల్టితో డిసెంబర్ 31 నాటికి సీఎంఆర్ బకాయిలు క్లియర్ చేసుకోవాలని రైస్ మిల్లర్లకు టైం ఇచ్చారు.
2023–-24 యాసంగి, వానాకాలంలో సప్లై చేసిన వడ్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు, వడ్ల నిల్వల లెక్క తేల్చేందుకు సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ అధికారులు మిల్లులను తనిఖీ చేస్తున్నారు. పనిలో పనిగా మిల్లుల్లో సేకరించిన బియ్యం శాంపిల్స్ నుల్యాబ్కు పంపిస్తున్నారు.
100 దాటిన రైస్ మిల్లులు..
జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించక ముందు పదుల సంఖ్యలో ఉన్న రైస్ మిల్లులు బీఆర్ఎస్ సర్కార్ పాలసీ పుణ్యమాని 100 దాటిపోయాయి. ఏటా వడ్లు ఇచ్చిన గత ప్రభుత్వం సీఎంఆర్ గురించి పట్టించుకోకపోవడంతో ఈ దందా బాగుందనుకున్న వారు మారుమూల పల్లెల్లోనూ రైస్ మిల్లులుఓపెన్ చేశారు. రా రైస్ మిల్లులకు పోటీగా పారాబాయిల్డ్ రైస్ మిల్లులు తెరిచారు.
ALSO READ : ప్రసవాల్లో సంగారెడ్డి ఆస్పత్రి రికార్డు .. ఈ ఏడాదిలో 7,221 కాన్పులు
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద భారీగా వరి సాగు అవుతుందన్న వ్యవసాయ శాఖ అంచనాలకు తగ్గట్టుగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షల్లో గోనె సంచులు, తేమ మెషీన్లు, ట్రాన్స్పోర్ట్ అంటూ హంగామా చేసిన ఆఫీసర్లు, మిల్లులకు కేటాయించిన వడ్లకు సంబంధించి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తరువాత సీఎంఆర్ బకాయిలపై ఒత్తిడి పెరగడం, హైకోర్ట్ సీరియస్ కావడంతో ఇప్పటి వరకు మిల్లర్లతో మిలాఖత్ అయిన అధికారులు సీఎంఆర్ రికవరీ కోసం తంటాలు పడుతున్నారు.
బకాయి జాబితాలో పెద్ద తలకాయలు..
2021–-22లో వడ్లు తీసుకున్న ఐదు బడా పారా బాయిల్డ్‌రైస్ మిల్లుల ఓనర్లు, ఆ వడ్లను రా రైస్ మిల్లులకు ఇచ్చారు. వారు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వారు వడ్లను బయటి మార్కెట్లో అమ్ముకోవడంతో ఎవరు భర్తీ చేయాలనే దానిపై రెండేండ్లుగా కిందామీద పడుతున్నారు. ఈ తతంగం అంతా అప్పటి అడిషనల్ కలెక్టర్, డీఎస్వో కనుసన్నలలో జరగడం గమనార్హం. మారిన పరిస్థితుల్లో జిల్లా అధికారులు సీఎంఆర్ బకాయిపై మిల్లర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
2021 నుంచి ఇదే తంతు..
20-21 నుంచి మిల్లర్లకు కేటాయించిన వడ్లను సీఎంఆర్ ఇవ్వకుండా బయట అమ్ముకున్నా పట్టించుకోలేదు. డిఫాల్టర్, బ్లాక్ లిస్ట్‌లో చేర్చాల్సిన మిల్లులకు మూడు సీజన్లలో కొనుగోలు చేసిన వడ్లను అప్పగించారు. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ ఏరియాలో కొన్ని మిల్లులు రూ.8 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు సీఎంఆర్ బకాయిలు ఉన్నా సివిల్ సప్లై ఆఫీసర్లు వెనుకేసుకొచ్చారు. వడ్ల కొనుగోళ్లు, సీఎంఆర్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన అడిషనల్ కలెక్టర్లు చూసీచూడనట్లు వ్యవహరించారు. సీఎంఆర్ పెట్టని మిల్లులకు రెండు సీజన్లలో వడ్లు కేటాయిస్తూ సహకరించారనే ఆరోపణలున్నాయి.
రంగంలోకి ఎఫ్‌సీఐ టీమ్..
వడ్ల కొనుగోళ్లు, సీఎంఆర్ వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉండే ఎఫ్‌సీఐ అధికారులు మూడు రోజులుగా మిల్లులను తనిఖీ చేస్తున్నారు. వడ్ల కేటాయింపులు, సీఎంఆర్ కోటా, వడ్ల నిల్వల్లో తేడాలను పరిశీలిస్తున్నారు. నవంబర్ 30లోగా సీఎంఆర్ క్లియర్ చేయాలని గడువు విధించారు. లేదంటే 125 శాతం పెనాల్టీతో డిసెంబర్ 31 నాటికి సీఎంఆర్ క్లియర్ చేయాల్సిందేనని ఎఫ్ సీఐ అధికారుల ఒత్తిడి చేస్తున్నారు.