
- పెద్దపల్లి జిల్లాలో పొలంబాట పేరుతో యాక్షన్ ప్లాన్
- వ్యవసాయ, గృహ వినియోగానికి క్వాలిటీ పవర్ సప్లైకి చర్యలు
- జిల్లాలో కొత్తగా మరో 160 డీటీఆర్‌ల ఏర్పాటు
- అగ్రికల్చర్ కనెక్షన్లు 73,614, డొమెస్టిక్ కనెక్షన్లు 2,14,362
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో సమ్మర్‌లో కరెంట్ కష్టాలు లేకుండా చేసేందుకు ఆ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. కరెంట్ సమస్యలకు స్పాట్‌లోనే పరిష్కారానికి పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా వ్యవసాయ పొలాలను సందర్శించి అక్కడ ఎలాంటి సమస్య ఉన్నా స్పాట్‌లోనే పరిష్కరిస్తున్నారు. సమ్మర్‌లో పెరగనున్న డిమాండ్‌కు అనుగుణంగా క్వాలిటీ కరెంట్ సప్లైకి చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు, డీటీఆర్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
క్వాలిటీ పవర్ సప్లైకి చర్యలు
పెద్దపల్లి జిల్లాలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లు 73, 614, డొమెస్టిక్(గృహ) కనెక్షన్లు 2,14,362 ఉన్నాయి. 69 సబ్స్టేషన్లు ఉండగా, 17,311 డీటీఆర్‌లు ఉన్నాయి. క్వాలిటీ పవర్ అందించడానికి జిల్లాలోని 74 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్) కెపాసిటీ పెంచడంతోపాటు కొత్తగా 160 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు అధికారులు ప్లాన్ రెడీ చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా క్వాలిటీ సప్లైకి చర్యలు తీసుకుంటున్నారు.
33కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ వ్యవస్థ పటిష్టం చేయడంతోపాటు ప్రతీ 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో ఎమర్జెన్సీ టైంలో ప్రత్యామ్నాయ ఫీడర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ఓవర్ లోడ్ ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లను గుర్తించి లోడ్ రిలీఫ్ చేసేందుకు లోడ్ బదలాయింపు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. గతంలో గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ ఎంత ఉందో టెస్ట్ రీడింగ్ తీసుకొని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పొలంబాటతో స్పాట్‌లోనే పరిష్కారం
పెద్దపల్లి జిల్లాలో పొలంబాట కార్యక్రమంలో పేరుతో ప్రతీ గ్రామంలోని పొలాలను సందర్శిస్తూ ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుసుకుంటున్నారు. దీంతోపాటు సమస్యలను స్పాట్‌లోనే పరిష్కరిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం ద్వారా క్వాలిటీ సప్లై సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు. కరెంట్ వైర్లను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్ చెక్ చేయడం, దూరంగా ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సమీపంలో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
వీటితోపాటు పట్టణాల్లోనూ నిరంతరం కరెంట్ సప్లైకి రింగ్ మెయిన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. సమ్మర్‌లో గాలిదుమారాలు, అకాల వర్షాల వంటి అత్యవసర సమయాల్లో సప్లైకి అంతరాయం ఏర్పడకుండా 11కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ లైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఓ వైపు గృహజ్యోతి స్కీముతో డొమెస్టిక్ వినియోగం పెరిగిన నేపథ్యంలో నిరంతర, క్వాలిటీ పవర్ సప్లైకి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
పవర్ సప్లయ్‌లో ఇబ్బందులు ఉండవు
గృహావసరాలకు, వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా సమస్య లేకుండా చూస్తున్నాం. పొలంబాట పేరుతో వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తున్నాం. వినియోగదారులకు క్వాలిటీ కరెంట్ సప్లై చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. - కె.కంకటి మాధవరావు, ఎస్ఈ, పెద్దపల్లి