హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని ఇండ్ల పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోతే ఫైన్లు వేయాలంటూ బల్దియా ఉన్నతాధికారులు ఎంటమాలజీ సిబ్బందిని ఆదేశించారు. ఒకటి, రెండు సార్లు ఇంటి యజమానులకు సూచించాలని, లార్వాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫైన్లు వేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్, రాజేంద్రనగర్ సర్కిళ్లలోని పలు ఇండ్లకు ఫైన్లు పడ్డాయి. ఇప్పటివరకు పైసలయితే వసూలు చేయలేదు కానీ.. మార్పు కనిపించకపోతే కాలనీల ప్రెసిడెంట్ల సాయంతో ఫైన్లు వసూలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బల్దియాలోని ఓ అధికారి తెలిపారు. వచ్చే నెలలో దోమలు వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ప్రజల్లో మార్పు రాకపోతే డెంగీ, మలేరియా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో దోమల నివారణ పేరుతో సిబ్బందిపై అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని కార్మిక యూనియన్నాయకులు అంటున్నారు.
సరిపడా సిబ్బంది లేరని, ఉన్నవారిపై పనిభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్రీడిండ్ పాయింట్లు పెరుగుతున్నయ్గ్రేటర్లో కోటి20 లక్షల జనాభా, 25లక్షల ఇండ్లు ఉండగా దోమల నివారణ కోసం ఎంటమాలజీ సిబ్బంది మాత్రం 2,300 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ప్రతిరోజు 200 ఇండ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించాలని అధికారులు ఆర్డర్లు ఇస్తున్నారు. అయితే గతంలో ముగ్గురు చేసే పనిని ఇప్పుడు ఒక్కరమే చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కమిషనర్ని కలిసి పరిస్థితిని వివరించారు. 4,846 కాలనీల్లో ఒక్కొక్కరికి ఐదారు కాలనీలు కేటాయిస్తుండడంతో పనిభారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 250కి పైగా సమస్యత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడే దోమలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. డెంగీ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే 33,500 బ్రీడింగ్ పాయింట్లు ఉన్నట్లుగా గుర్తించారు. చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ దోమలు మాత్రం తగ్గడం లేదు.
జనం ఆగ్రహం
ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోతే ఫైన్లు వేస్తామని సిబ్బంది చెబుతుండటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలు, రోడ్లపై ఉన్న చెత్తను ముందు క్లీన్చేయాలని డిమాండ్
చేస్తున్నారు. రోడ్లపై మురుగు పారుతుంటే దోమలు పెరగకుండా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. తమకు ఫైన్లు వేసే ముందు రోడ్లు క్లీన్ చేయాలని సూచిస్తున్నారు. ఎంటమాలజీ సిబ్బంది రోగాల బారిన పడుతున్రుగ్రేటర్ జనాభా పెరుగుతున్నా జీహెచ్ఎంసీ సిబ్బందిని పెంచట్లేదు.
కోటి మందికి పైగా ఉన్న సిటీలో దోమల నివారణకు పనిచేసే ఎంటమాలజీ విభాగంలో కేవలం 2,300 మంది సిబ్బందే ఉన్నారు. వీరి సంఖ్యను 7,500కు పెంచాలి. కొత్తగా ఎవరినీ తీసుకోక పోవడంతో ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఒక్కో కార్మికుడు డైలీ 100 ఇండ్లల్లో యాంటిలార్వా ఆపరేషన్ చేయగలడు. కానీ 200 ఇండ్లలో చేయాలంటూ ఆర్డర్లు ఇవ్వడమేంటి? ఇదే విషయంపై కమిషనర్ని కలిశాం. ఎంటమాలజీ సిబ్బంది రోగాల బారిన పడుతున్నారు. వారిపై పనిఒత్తిడి పెట్టడం కరెక్ట్ కాదు.
- గోపాల్, జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్