- కొత్త మండలాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
- రైతులకు తీరనున్న తిప్పలు
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొత్త మండలాల్లో అదనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇరవై పీఏసీఎస్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదన రూపొందించారు. కొత్త మండలాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లా అధికారులు తాజాగా ప్రతిపాదనలను తయారు చేశారు. నిర్మల్ జిల్లాలో 8, ఆదిలాబాద్‌లో 6, మంచిర్యాలలో 3, కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో మరో 3 పీఏసీఎస్ లను ఏర్పాటు చేయనున్నారు.
పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కూడా..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 77 పీఏసీఎస్ లు ఉన్నాయి. వీటిల్లో లక్షా 77 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లో రైతులకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతు
న్నాయి. వ్యవసాయ రుణాలు అందించడంతోపాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కూడా ఇక్కడి నుండే కొనసాగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న పలు పీఏసీఎస్‌లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం నిర్వహిస్తున్నాయి. అయితే, కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటినుంచి పీఏసీఎస్ ల విస్తరణ జరగలేదు. ఇటీవల కొత్త మండలాలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు కాగా.. వీటికనుగుణంగా పీఏసీఎస్‌ల పరిధి పెరగలేదు. దీంతో కొత్త మండలాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త మండలాలకు కూడా సేవలు విస్తరించేలా పీఏసీఎస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి పాదనలను కోరింది. దీంతో ఉమ్మడి జిల్లా సహకార శాఖ అధికారులు 20 పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
అధికారుల తాజా ప్రతిపాదనలు ఇవే..
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న 77 పీఏసీఎస్ లతోపాటు కొత్తగా ఏర్పడబోయే 20తో కలుపుకొని మొత్తం 97 కానున్నాయి. సంఖ్య పెరగనుండడంతో కొత్త సభ్యులకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని 28 సంఘాల్లో 59,483 మంది రైతులు, మంచిర్యాల జిల్లాలో 20 సంఘాల్లో 47,474 మంది, నిర్మల్‌లోని 17 పీఏసీఎస్‌లలో 46,928 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 12 పీఏసీఎస్ లలో 23,788 మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. నిర్మల్ జిల్లాలో ముథోల్, దస్తురాబాద్, పెంబి, నర్సాపూర్, బెల్తరోడ, మాలే గావ్, సోన్, పొన్కల్‌లో కొత్త పీఏసీఎస్‌ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆదిలాబాద్‌లో బోరజ్, సాత్నాల, సొనాల, గాదిగూడ, భీంపూర్, ఆసిఫాబాద్ లోని సిర్పూర్ యు, చింతలమానేపల్లి, లింగాపూర్, పెంచికల్పేట్లో, మంచిర్యాలలోని భీమారం, కన్నేపల్లి, నస్పూర్‌లో కొత్తగా పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి.