పోలింగ్​కు సర్వం సిద్ధం..1,174 ప్రాంతాల్లో 1,809 పోలింగ్​ స్టేషన్ల ఏర్పాటు

  •     మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్​
  •     మహబూబాబాద్​ పార్లమెంట్​ పరిధిలో 15,32,366 మంది ఓటర్లు
  •     నేడు ఈవీఎంలు, సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
  •     ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని పోలీసుల ప్లాగ్​ మార్చ్​

మహబూబాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబాబాద్​పార్లమెంట్​పరిధిలో 1809 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే ఆయా కేంద్రాలకు అధికారుల నియామకం, శిక్షణ పూర్తి చేశారు.  పార్లమెంట్​ పరిధిలో మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉండగా, ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ కొనసాగించనున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు పోలీసులు ఫ్లాగ్​మార్చ్​తో భరోసా కల్పించారు. నేడు నియోజకవర్గాల వారీగా ఎలక్షన్​మెటీరియల్​ పంపిణీ కోసం డిస్టిబ్యూషన్​సెంటర్లను ఏర్పాటు చేశారు.  

ఈవీఎంల పంపిణీ సెంటర్లు.. 

డోర్నకల్ నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి సెయింట్ అగస్టిన్ హైస్కూల్,​ మరిపెడలో ఎలక్షన్​ మెటీరియల్​ను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గం టీఎస్​డబ్ల్యూఆర్​ఎస్​జేసీ, మహబూబాబాద్ లో, నర్సంపేటకు ఏఎంసీ గోదాం_1, నర్సంపేటలో, ములుగుకు ప్రభుత్వ బాలుర కళాశాల, ములుగులో

పినపాకకు మణుగూరు జడ్పీహెచ్ఎస్ లో, ఇల్లందకు ఇల్లంద కేకే కాలనీ సింగరేణి కాలరీస్​స్కూల్​లో, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలో ఈవీఎం సామగ్రిని పంపిణీ చేయనున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్..​

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏజెన్సీ నియోజకవర్గాలైన ఇల్లంద, పినపాక, భద్రాచలం, ములుగు నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఉదయం 7  నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ కొనసాగనుంది.

పోలింగ్ కోసం సర్వం సిద్ధం

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు 1,174 ప్రాంతాల్లో 1809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాట్లు చేశారు. 1,348 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్​, 637 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. 335 ప్రాంతాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పార్లమెంట్ పరిధిలో 228 రూట్లకు 228 సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. ఈ పార్లమెంట్ పరిధిలో పురుషులు 7,47,836 మంది, మహిళలు 7,84,424 మంది, ఇతరులు 106, మొత్తంగా 15,32,366 మంది ఓటర్లు ఉన్నారు.

నిర్భయంగా ఓటు వేయాలి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహబూబాబాద్​ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్  అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వీఎన్​ఆర్ గార్డెన్ వరకు శనివారం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూర్ డీఎస్పీ సురేశ్, సీసీఎస్ డీఎస్పీ మోహన్, ఎస్బీ సీఐ బాలాజీ వరప్రసాద్, సీఐలు, ఎస్సైలు, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు.