- ఖమ్మం లోక్ సభ బరిలో 35 మంది అభ్యర్థులు
- స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచెల భద్రత
- 4న శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్
- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అంతా సిద్ధం చేశారు. గత నెల 13న పోలింగ్ ముగియగా, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది(76.09 శాతం) ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్, ఈవీఎంల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభం అవుతాయి. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఓట్ల లెక్కింపు కోసం సెగ్మెంట్ కు ఒకటి చొప్పున ఏడు హాళ్లు
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం ఒకటి కలిపి మొత్తం 8 హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయగా, ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 355 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వాళ్లందరి తరఫున 117 మంది ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
5 గంటలకే స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్...
కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లను రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నారు. అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు ముందుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6.30వరకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆఫీసర్లు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు. ఆ తర్వాత ప్రతీ రౌండ్ కౌంటింగ్ తర్వాత ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ సిబ్బందితో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు
156 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ రెగ్యులర్ గా తనిఖీ చేసి సూచనలు చేస్తున్నారు. పారదర్శకత కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్స్ స్లిప్పులను లెక్కించనున్నారు.
ఎవరి ధీమా వారిది..
ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరఫున రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో 20 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో 13 మంది పోటీలో నిలిచారు. ఈసారి అంతకు మించి 24 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. దీంతో వీరికి వచ్చిన ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారతారనేది ఆసక్తికరంగా ఉంది. తమ విజయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.