ట్రిపుల్ ఆర్ త్రీజీ రిలీజ్ ....ల్యాండ్ డిటైల్స్​ 'భూమి రాశి' పోర్టల్​లో అప్​లోడ్​​

ట్రిపుల్ ఆర్ త్రీజీ రిలీజ్ ....ల్యాండ్ డిటైల్స్​ 'భూమి రాశి' పోర్టల్​లో అప్​లోడ్​​
  • చౌటుప్పల్ పరిధిలో 21 నుంచి డాక్యుమెంట్ సేకరణ
  • మొదటి 'కాలా'లో 70 శాతం సేకరణ పూర్తి
  • త్వరలో ​భువనగిరి త్రీజీ 

యాదాద్రి, వెలుగు : రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్) కోసం భూసేకరణపై పెండింగ్​లో ఉన్న చౌటుప్పల్​ఏరియా పరిధిలో త్రీజీ నోటిఫికేషన్​ను అధికారులు రిలీజ్ చేశారు. భువనగిరికి సంబంధించిన త్రీజీ నోటిఫికేషన్​నేషనల్​హైవే అథారిటీ వద్దకు చేరింది. దీన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ​ ట్రిపుల్​ఆర్ ఉత్తర భాగం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డి పల్లెలో ఎంటర్​అవుతోంది.

అక్కడ నుంచి ఐదు మండలాల్లోని 24 గ్రామాల మీదుగా చౌటుప్పల్​లో ఎండ్ కానుంది. జిల్లాలో మొత్తంగా 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానుంది. భూ సేకరణకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరి గుట్ట మండలాలకు యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ను, భువనగిరికి ఆ డివిజన్​ ఆర్డీవోను, చౌటుప్పల్​, వలిగొండలకు చౌటుప్పల్​ ఆర్డీవోను కాంపిటెంట్​ అథారిటీ ఫర్​ లాండ్​ అక్విగిషన్​ (కాలా)గా నియమించారు.

 తుర్కపల్లి, యాదగిరిగుట్ట భూ సేకరణకు సంబంధించి గతంలోనే త్రీజీ నోటిఫికేషన్​ విడుదలైంది. చౌటుప్పల్, వలిగొండ​ పరిధిలో సేకరించే 792 ఎకరాల్లో పెండింగ్​లో ఉన్న భూమికి త్రీజీ నోటిఫికేషన్​ను తాజాగా విడుదల చేశారు. ఈ రెండు ఏరియాలకు సంబంధించి సేకరించే భూముల వివరాలను 'భూమి రాశి' పోర్టల్​లో ఇప్పటికే అప్​లోడ్ చేశారు. చౌటుప్పల్ కు సంబంధించి ఈనెల 21 నుంచి 25 వరకు చౌటుప్పల్, వలిగొండ తహసీల్దార్ల ఆఫీసుల్లో  రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సమావేశాల్లోనే రైతులు, వెంచర్లు, ప్లాట్ల ఓనర్లు తమ భూములకు సంబంధించి డాక్యుమెంట్స్​తోపాటు ఆధార్, బ్యాంక్​అకౌంట్ నంబర్లు​ అందించాల్సి ఉంది. డాక్యుమెంట్లు అందించని వారికి భూమి రాశి పోర్టల్లో నమోదైన భూములు, విలువ ఆధారంగా అవార్డు ప్రకటిస్తారు.  

తుర్కపల్లి పరిధిలో 70 శాతానికి పైగా..

యాదాద్రి అడిషనల్ కలెక్టర్​ పర్యవేక్షిస్తున్న తుర్కపల్లి, యాదగిరిగుట్ట పరిధిలో వీరారెడ్డి పల్లె, కోనాపురం, దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్, వేల్పల్లి, మల్లాపూర్, దాతరుపల్లి గ్రామాల్లో 510 ఎకరాలను సేకరిస్తున్నారు. ఈ భూములు కోల్పోతున్న రైతులు, ఐదు వెంచర్లు, ప్లాట్ల ఓనర్ల నుంచి ల్యాండ్​ డాక్యుమెంట్స్, ఆధార్, బ్యాంక్​అకౌంట్స్​నంబర్ల సేకరణ కొనసాగుతోంది. అయితే యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలోని 52 సర్వే నంబర్, సబ్ సర్వే నంబర్​లో ధరణి నక్షల కండాస్ట్రల్​ ప్రకారం 17 మంది రైతులకు సంబంధించి 18.33 ఎకరాల ల్యాండ్​ఉంది.

ఇందులో ఏడుగురికి సంబంధించిన 6.36 ఎకరాలను ట్రిపుల్​ఆర్​కు సేకరిస్తున్నారు.  1.20 ఎకరాల స్థలంలోని 45 ప్లాట్లకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ డాక్యుమెంట్స్ అందించలేదు. ఆఫీసర్లు తెలుసుకునే ప్రయత్నం చేసినా ఎవరివో అర్థంకావడం లేదు. ఈ రెండు మండలాల పరిధిలోని దాదాపు 60కి పైగా సర్వే నంబర్లలో 800 మందికి పైగా భూములు కోల్పోతున్నారు. వారిలో 70 శాతానికి పైగా రైతులు తమ డాక్యుమెంట్లను సేకరించారు. ఈ డాక్యుమెంట్ల ఆధారంగానే వారి ఖాతాల్లో ప్రభుత్వం నుంచి అందే 'అవార్డు' సొమ్ము జమ చేస్తారు. 

భువనగిరి పరిధిలో..

ట్రిపుల్​ఆర్​అలైన్​మెంట్​ను వ్యతిరేకిస్తూ భువనగిరి రైతులు వేసిన కేసును ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది. దీంతో భువనగిరి పరిధిలో పెండింగ్​లో ఉన్న 75 ఎకరాల కోసం రూపొందించిన త్రీజీ నోటిఫికేషన్​ జిల్లా నుంచి నేషనల్ హైవే అధికారులకు చేరింది. ఈ వారంలోనే త్రీజీ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నెలాఖరులో రైతులతో మీటింగ్ నిర్వహించి.. డాక్యుమెంట్స్ తీసుకోనున్నారు .