ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు

కోదాడ, వెలుగు :  వైద్యారోగ్యశాఖ అనుమతులు లేకుండా కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీహృదయ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా కోదాడలో ఆస్పత్రుల నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం తో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర్యంలోని అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శ్రీహృదయ ఆస్పత్రి రికార్డులు పరిశీలించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో  మాట్లాడుతూ పూర్తిస్థాయి అర్హత పత్రాలు సమర్పించేంత వరకు శ్రీహృదయ ఆస్పత్రిని మూసి వేయనున్నట్లు తెలిపారు. వైద్యులు తమ అర్హతలు, రిజిస్ట్రేషన్ నంబర్లను విధిగా ప్రదర్శించాలని చెప్పారు. తనిఖీల్లో డాక్టర్ నిరంజన్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్  కల్యాణ్​ చక్రవర్తి, అంజయ్య పాల్గొన్నారు.