ఓయూ,వెలుగు : ఉస్మానియా వర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్ద ఉన్న 18వ శతాబ్దపు నాటి పురాతన మెట్లబావి బ్యూటిఫికేషన్ పనులకు అధికారులు చర్యలు చేపట్టారు. మహలకా చందాబాయి పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ మెట్లబావిని అందంగా మార్చి పూర్వ వైభవాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం ఓయూ అధికారులతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ముందుకు వచ్చాయి. హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఓయూలోని ఈ మెట్లబావి పునరుద్ధరణ పనులను అధికారులు ప్రారంభించారు.
ఓయూ అధికారులు, స్టూడెంట్లు, హెచ్ఎండీఏ అధికారులు, స్వచ్చంద సంస్థల వలంటీర్లు దాదాపు 100 మందిఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్దియా అధికారి కల్పనా రమేశ్ మాట్లాడుతూ.. సిటీలోని చారిత్రక కట్టడాలైన పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక కేంద్రాలుగా మారుస్తామన్నారు. మెట్ల బావి బ్యూటిఫికేషన్ పనులను 3 దశల్లో చేపట్టనున్నట్లు వీసీ రవీందర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఫ్యాకల్టీ, స్టూడెంట్లు హాజరయ్యారు.