- ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు కొత్తగా చేర్చేందుకు కసరత్తు
- క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణకు కలెక్టర్ ఆదేశాలు
- ఆయా గ్రామాలు కలిస్తే.. 214 గ్రామాలతో కుడా పరిధి
హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్డెవలప్ మెంట్ అథారిటీ(కుడా)లోకి కొత్త గ్రామాలను చేర్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇదివరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 19 మండలాల పరిధిలోని 181 గ్రామాలు కుడా లిమిట్స్లోకి వెళ్లాయి. అప్పట్లో హనుమకొండ జిల్లాలోకి కొత్తగా చేరిన మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు కుడా పరిధిలో లేవు. అవి కూడా వివిధ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నాయి.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మొత్తంగా 33 గ్రామాలను కుడాలో కలిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఆయా గ్రామాలు కలిస్తే.. కుడా పరిధిలో గ్రామాల సంఖ్య 214కు చేరనుంది. కొత్తగా కుడాలో కలిపే జాబితాలో హుస్నాబాద్సెగ్మెంట్ లోని భీమదేవరపల్లి మండలం, పరకాల సెగ్మెంట్ లోని పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, సెగ్మెంట్ లోని శాయంపేట, వర్ధన్నపేట సెగ్మెంట్ లోని ఐనవోలు మండలాలకు చెందిన గ్రామాలు ఉన్నాయి. వీటి విలీనంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కుడాలో ఆయా గ్రామాలను కలిపేందుకు రిమార్క్స్ఏమైనా ఉంటే ముందుగానే తెలపాల్సిందిగా హనుమకొండ కలెక్టర్నుంచి జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు అందాయి. దీంతో గ్రామాల విలీనానికి క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
కొత్తగా చేరే గ్రామాలు ఇవే..
హుస్నాబాద్ సెగ్మెంట్ : భీమదేవరపల్లి మండలంలోని మల్లారం, కొత్తకొండ, ముస్తఫాపూర్, గట్ల నర్సింగాపూర్, వంగర, రత్నగిరి, కన్నారం, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి.
పరకాల సెగ్మెంట్ : పరకాల మండలంలోని రాజిపేట, కామారెడ్డి పల్లి, మాధారం, వెల్లంపల్లి, పోచారం, మల్లక్ పేట, పరకాల. దామెర మండలంలోని సర్వాపూర్, కంఠాత్మకూర్, కౌకొండ. నడికూడ మండలంలోని ధర్మారం, రాయిపర్తి, ముస్త్యాలపల్లి, నడికూడ.భూపాలపల్లి సెగ్మెంట్: శాయంపేట మండలంలోని పత్తిపాక, కొత్తగట్టు సింగారం, హుస్సేన్పల్లి, మైలారం, పెద్ద కొడెపాక, తహరాపూర్, గట్ల కానిపర్తి, శాయంపేట.
వర్ధన్నపేట సెగ్మెంట్: ఐవనోలు మండలంలోని నందనం, కక్కిరాలపల్లి.