ప్రభుత్వ అసైన్డ్​ భూమికి అక్రమంగా పట్టా... 12 ఎకరాలు కట్టబెట్టిన అధికారులు

  •     నల్గొండ జిల్లాలో 12 ఎకరాలను అక్రమంగా కట్టబెట్టిన అధికారులు 
  •     పోలీసుల అదుపులో ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్​వో 
  •     ఆరుగురు రైతులు కూడా...నిడమనూరులో కలకలం

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సమీపంలోని మార్తవాణి గూడెంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేసిన వ్యవహారంలో గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్ వోతో పాటు ఆరుగురు రైతులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మార్తవాణిగూడెం శివారులోని సర్వే నెంబర్లు 840, 1072లో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు..ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున రెవెన్యూ అధికారులు అప్పట్లో అక్రమంగా పట్టా చేశారు.

దీంతో గ్రామానికి చెందిన అడ్వకేట్ మార్తూ వెంకటరెడ్డి మూడేండ్ల కింద హైకోర్టులో రిట్​పిటిషన్ దాఖలు ​వేశారు. ప్రభుత్వ అసైన్డ్  భూములను భూమిలేని నిరుపేదలకు పంచాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గ అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే రెవెన్యూ అధికారులు నేరుగా రైతులకే పట్టా చేశారని అందులో పేర్కొన్నారు.

ముడుపులు తీసుకుని ఈ పని చేశారని ఆరోపించడంతో ఉన్నత న్యాయస్థానం విచారణకు  స్వీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అప్పటి నిడమనూరు తహసీల్దార్లు నాగార్జున రెడ్డి, దేశ్యా నాయక్, నాగరాజు, వీఆర్​వో సుమన్ , మరో ఆరుగురు రైతులను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.