గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన​

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన​

జనగామ అర్బన్/ హనుమకొండ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జన ఏర్పాట్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్, వరంగల్​సీపీ అంబర్​కిషోర్​ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పార్ధసారథితో కలిసి పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు విద్యుత్, నీటిపారుదల, రోడ్లు భవనాలు, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులను వారు ఆదేశించారు. జనగామ జిల్లా సామాజిక సమరసత కన్వీనర్ గుజ్జుల కుమార స్వామి ఆధ్వర్యంలో గణేశ్​ఉత్సవ సమితి సభ్యులు నెల్లుట్ల చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించి, ఈ నెల 16న నిమజ్జం నిర్వహించాలని అన్నారు. 

వరంగల్​పద్మాక్షి, బంధం చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్రమణకు గురైన చెరువులను రక్షించేందుకు ఐపీఎస్ ఆఫీసర్​తో వరంగల్ డిసాస్టర్​ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (వాడ్రా) ను ఏర్పాటు చేయించి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, మానసరాంప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 16న వినాయక నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు.