నిర్మల్, వెలుగు : జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని, సి విజిల్ యాప్ వినియోగంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్ అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలన్నారు. ఓటరు జాబితాపై వచ్చే ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు.
అనంతరం ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవిరంజన్ కుమార్ విక్రమ్, గోపాలకృష్ణతో కలిసి కంట్రోల్ రూమ్, మీడియా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. లోకల్ ఛానల్, టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలను సైతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డీపీఆర్ఓ తిరుమల, కంట్రోల్ రూం నోడల్ అధికారి సందీప్, సి విజిల్ నోడల్ అధికారి మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాం
ఆసిఫాబాద్: ఈనెల 30 జరగనున్న ఎన్నికల కోసం పోలింగ్‌కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు వెల్లడించారు. రాష్ట్ర అడిషనల్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిర్పూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దీపక్ తివారితో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 597 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసి అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక రక్షణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి..
ఎన్నికల రోజు వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు..