నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గల హిండిస్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ రమారాజేశ్వరి సందర్శించి..ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులను ఆమె పరామార్శించారు. అయితే క్షతగాత్రుల్లో ముగ్గురిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కంపెనీ యాజమాన్య నిర్లక్షం ఉంటే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.
రియాక్టర్ పేలి ఒకరి మృతి
హిండిస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కంపెనీ చుట్టుపక్కల భారీగా పొగ కమ్మేసింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదు.
కాగా కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భారీగా కమ్ముకున్న పొగతో వెలిమినేడు, పిట్టంపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి సమీప గ్రామస్తుల భయాందోళనకు గురయ్యారు