హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. FTL జోన్ లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులిచ్చారు. నెక్లార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కో ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని పలు ఇళ్లకు నోటీసులు వెళ్లాయి. మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులు వివరించారు శేరిలింగపల్లి తహసిల్దార్.
Also Read:-హైదరాబాద్ సిటీకి రెడ్ అలర్ట్
అటు చెరువును ఆనుకొని ఖరీదైన బిల్డింగ్స్ తోపాటు చెరువు చుట్టూ VIP ల నివాసాలను గుర్తించారు. దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల ఇండ్లున్నాయి. అటు FTL జోన్ లోనే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతిరెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు.
నోటీసులు ఇచ్చిన వారిలో ఐదుగురు రిటైర్డ్ IAS అధికారులు, సత్యం రామలింగరాజు కొడుకు, దుబ్బాక BRS MLA కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. 1996 లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్తున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం... ఉన్నపళంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు.
మరో వైపు తనకు రెవెన్యూ శాఖ నోటీసులివ్వడంపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అప్పట్లో ఈ భూమి FTL ఉన్నట్లు తనకు తెలియదన్నారు.ఇప్పుడు FTLలో ఉన్న భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తన నివాసం విషయంలో సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి.